Safe travel | కోరుట్ల, మే 9: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణీకులు సురక్షితంగా ప్రయాణం చేయవచ్చని, ప్రైవేట్ వాహనాలు ఆశ్రయించవద్దని కోరుట్ల టీజీ ఆర్టీసీ డీపో మేనేజర్ మనోహర్ అన్నారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ప్రయాణీకుల ఆదరణపైనే ఆర్టీసీ సంస్థ మనుగడ ఆధార పడి ఉందన్నారు. ఇటీవల కొంతమంది ప్రైవేట్ వాహనాలకు చెందిన వారు సోషల్ మీడియా ద్వారా ఏయిర్పోర్టు నుంచి వాహనాలు ఖాళీగా వస్తున్నాయని, తమ వాహనాలను బుక్ చేసుకోవాలని మెసెజ్లు పంపుతున్నట్లు తెలిపారు.
దీంతో ఆర్టీసీకి నష్టం కలిగే అవకాశం ఉందన్నారు. డీపో నుంచి శంషాబాద్ విమానశ్రయానికి గతంలో రెండు బస్సులు ఉండగా ప్రస్తుతం 4 బస్సులు నడుపుతున్నామని, ఆంధ్ర ప్రదేశ్లోని కనిగిరి, పామూరు, వింజమూరుకు 4 బస్సు సర్వీసులను నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు. పట్టణ, పరిసర గ్రామాల ప్రజలు ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేసి సురక్షితమైన సుఖవంతమైన ప్రయాణాన్ని పొందాలన్నారు. ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించకుండా ప్రతీ ఒక్కరూ ఆర్టీసీ సంస్థకు ప్రోత్సాహం అందించాలని డీఎం విజ్ఞప్తి చేశారు.