కమాన్‌చౌరస్తా/ హుజూరాబాద్ టౌన్/ జమ్మికుంట/ మానకొండూర్/ మానకొండూర్ రూరల్/ తిమ్మాపూర్/ శంకరపట్నం/ చిగురుమామిడి/ వీణవంక/ సైదాపూర్/ గంగాధర/ కొత్తపల్లి/ రామడుగు/ కరీంనగర్ రూరల్/గన్నేరువరం, అక్టోబర్ 10: జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబురాలు గురువారం ఘనంగా జరిగాయి. వాడవాడలా బతుకమ్మ పాటలు మార్మోగాయి. పలు చోట్ల వర్షం వల్ల అంతరాయం కలిగినప్పటికీ వేడుకలు ఆనందోత్సాహాలతో ముగిశాయి. ‘సద్దుల’ సంబురాల్లో భాగంగా మహిళలు తీరొక్క పూలతో ఉదయాన్నే బతుకమ్మలను పేర్చారు. సాయంత్రం వీధుల్లో ఒకచోట చేరి ఆడి పాడారు. అనంతరం చెరువులు, కాలువలు, కుంటల్లో బతుకమ్మను నిమజ్జనం చేసి పోయిరా గౌరమ్మ అంటూ వీడ్కోలు పలికారు. ముత్తయిదువలు వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. నగరంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ వై సునీల్ రావుతో కలిసి పలుచోట్ల బతుకమ్మ సంబురాలకు హాజరై, ఆడబిడ్డలకు శుభాకాంక్షలు తెలిపారు. ఏర్పాట్లను పరిశీలించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో ఆయన సతీమణి రజిత, చైతన్యపురి కాలనీలోని శ్రీ మహాశక్తి ఆలయ ప్రాంగణంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సతీమణి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. రాంనగర్ రమా సహిత సత్యనారాయణ ఆలయం ఎదుట డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణీ హరిశంకర్, డివిజన్ మహిళలు బతుకమ్మ ఆడారు.
ఆ తర్వాత మానేరు జలాశయం, మానకొండూర్, కొత్తపల్లి, చింతకుంట చెరువుల్లో నిమజ్జనం చేశారు. ఆయా కార్పొరేటర్లు, యువజన సంఘాలు బతుకమ్మ నిమజ్జనానికి వాహనాలు సమకూర్చారు. మానకొండూర్ చెరువుకట్టపై బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో సాగాయి. గ్రామస్తులతోపాటు కరీంనగర్ నుంచి సైతం మహిళలు అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి బతుకమ్మ ఆడారు. మానకొండూర్ ఇన్చార్జి సీఐ కాంతాల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది చెరువుకట్ట వద్ద ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పర్యవేక్షించారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ బతుకమ్మ నిమజ్జన కార్యక్రమాన్ని పరిశీలించారు. హుజూరాబాద్ పట్టణ శివారులోని బతుకమ్మ మైదానం, జమ్మికుంట కళాశాల మైదానంలో మున్సిపాలిటీల ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించగా, ఆడబిడ్డలు జోరు వానలోనూ ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్‌బాబు వేర్వేరుగా హాజరయ్యారు. అందమైన బతుకమ్మలను పేర్చిన మహిళలకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బహుమతులు అందజేశారు. ఇక్కడ మున్సిపల్ అధ్యక్షులు గందె రాధికాశ్రీనివాస్, తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు, హుజూరాబాద్ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కొలిపాక నిర్మల, కౌన్సిలర్లు, అధికారులు ఉన్నారు. కొత్తపల్లిలో వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. తిమ్మాపూర్‌లో మాజీ ఎంపీపీ కేతిరెడ్డి వనితా దేవేందర్ రెడ్డి, పలు గ్రామాల్లో మహిళా మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.
వీణవంక మండలకేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆయా చోట్ల మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, మాజీ జడ్పీటీసీ మాడ వనమాల-సాధవరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ లత-శ్రీనివాస్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు. గంగాధర మండలం మధురానగర్, బూరుగుపల్లిలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, బూరుగుపల్లిలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. బూరుగుపల్లి గ్రామానికి చెందిన ముస్లిం మహిళ సుల్తానాబేగం తన నివాసంలో బతుకమ్మను పేర్చారు. కాగా, కులమతాలకు అతీతంగా ప్రతి ఏడాది బతుకమ్మను పేర్చుతున్న సుల్తానాబేగంను గ్రామస్తులు అభినందించారు. జిల్లా కేంద్రంలో రామడుగు మాజీ జడ్పీటీసీ వీర్ల కవిత, వెలిచాల మాజీ సర్పంచ్ వీర్ల సరోజన బతుకమ్మ సంబురాలను కనుల పండువగా జరుపుకొన్నారు. మానకొండూర్, సైదాపూర్, ఇల్లందకుంట, గన్నేరువరం, కరీంనగర్ మండల వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. వెన్కేపల్లి-సైదాపూర్తో పాటు పలు గ్రామాల్లో బతుకమ్మ ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా పరిశీలించారు. అనంతరం సైదాపూర్‌లో దుర్గామాత మండపాల్లో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శంకరపట్నం మండలంలో వర్షం కురువడంతో పలు గ్రామాల్లో ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లలో మహిళలు బతుకమ్మ ఆడారు. పలు గ్రామాల్లో లైట్లు, తదితర ఏర్పాట్లు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.