వేములవాడ టౌన్,సెప్టెంబర్ 27 : ‘సద్దుల’ సంబురం అంబరాన్నంటింది. వేములవాడ నియోజకవర్గం ‘పూల సింగిడి’ని తలపించింది. శనివారం ఉదయం నుంచే ఆడబిడ్డల సందడి మొదలైంది. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను కూడళ్ల వద్దకు చేర్చి ఆడిపాడగా, ఊరారా జాతర సాగింది. వేములవాడ పట్టణంతో పాటు రాజన్న ఆలయ ఆవరణలో వేడుక కనులపండువగా జరిగింది.
‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు గౌరమ్మ ఉయ్యాలో.’ అంటూ మహిళలు పాటలతో హోరెత్తించగా వాడవాడా మారుమోగింది. అనంతరం మూలవాగుతోపాటు చెరువులు, కుంటలు, కాలువలు, ఘాట్ల వద్ద నిమజ్జనం చేసి, ‘పోయిరా గౌరమ్మా. పోయిరావమ్మా’ అంటూ వీడ్కోలు పలికింది.