కరీంనగర్, డిసెంబర్ 30(నమస్తే తెలంగాణ): రైతన్న ఇంటికి పెట్టుబడి సాయం చేరుతోంది. యాసంగి సాగుకు సిద్ధమైన తరుణంలోనే రైతుబంధు అందుతోంది. మూడురోజుల నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమ చేసి, సీఎం కేసీఆర్ పేరిట సెల్ఫోన్లకు మెస్సేజ్‌లు పంపిస్తుండడంతో రైతులు ఆనందంలో మునిగిపోయారు. సీజన్ ప్రారంభంలో పెట్టుబడికి పైసలు అందుతుండడంతో సంబురపడుతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, కృతజ్ఞతలు తెలిపారు. సీఎం సారు చెప్పిటనట్లే రైతుబంధు సాయాన్ని పంట పెట్టుబడి, వ్యవసాయపనులకు ఉపయోగించుకుంటామని చెబుతున్నారు.
కరీంనగర్ : జిల్లాలో మొత్తం 1,79,957 మంది రైతులకు రూ.175 కోట్ల 38 లక్షల 44 వేల 965 మంజూరు చేశారు. ఇందులో ఈ రోజు వరకు 1,59,434 మంది రైతులకు సంబంధించిన వివరాలను వ్యవసాయ అధికారులు ట్రెజరీకి పంపించారు. రూ.114 కోట్ల 91 లక్షల 89 వేల 274 మొత్తం వీరికి చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు 1,18,872 మందికి రూ.56 కోట్ల 97 లక్షల 26 వేల 760 రైతుల ఖాతాల్లో జమయ్యాయి.
పెద్దపల్లి : జిల్లాలో మొత్తం 1,39,831 మంది రైతులకు రూ.133 కోట్ల 79 లక్షల 83 వేల 405 మంజూరు చేశారు. ఇందులో ఈ రోజు వరకు 1,24,841 మంది రైతులకు సంబంధించిన వివరాలను వ్యవసాయ అధికారులు ట్రెజరీకి పంపించారు. రూ.89 కోట్ల 92 లక్షల 43 వేల 186 మొత్తం వీరికి చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు 94,448 మందికి రూ.46 కోట్ల 41 లక్షల 67 వేల 087 రైతుల ఖాతాల్లో జమయ్యాయి.
జగిత్యాల : జిల్లాలో మొత్తం 2,15,033 మంది రైతులకు రూ.206 కోట్ల 63 లక్షల 84 వేల 924 మంజూరు చేశారు. ఇందులో ఈ రోజు వరకు 1,90,656 మంది రైతులకు సంబంధించిన వివరాలను వ్యవసాయ అధికారులు ట్రెజరీకి పంపించారు. రూ.134 కోట్ల 51 లక్షల 62 వేల 450 మొత్తం వీరికి చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు 1,49,120 మందికి రూ.74 కోట్ల 75లక్షల 67 వేల 827 రైతుల ఖాతాల్లో జమయ్యాయి.
రాజన్న సిరిసిల్ల : జిల్లాలో 1,28,361 మంది రైతుల వివరాలు ఆన్లైన్లో నమోదవగా, ఇప్పటి వరకు 1,19,291 మంది రైతులకు రూ.125,98,37,444 కోట్లను వారీ బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమచేసింది. జమయిన వెంటనే సెల్ఫోన్లకు మెసేజ్ రావడంతో రైతులు చూసుకుని మురిసి పోయారు.
పెట్టువడి ఎల్లుతంది
నా పేరు ఎర్ర సంజీవ్. మాది కరీంనగర్ రూరల్ మండలం గోపాల్పూర్. నాకు మా ఊళ్లె 34 గుంటల భూమి ఉన్నది. కేసీఆర్ వచ్చినంక రైతుబంధు కింద ఇస్తున్న పైసల్తోని పెట్టువడి ఎల్తంది. ఇప్పటికే ఐదేండ్ల సంది పసల్కు 4,250 రూపాలొస్తున్నయి. ఈ పైసల్తోని దున్నిన ట్రాక్టర్ కిరాయి ఎల్లంగ మందు బస్తాలు సుతం తెచ్చుకుంటన్న. ఇప్పుడు యాసంగిల పైసలు సుతం నిన్ననే పడ్డయి. పైసలు ఇడిపిచ్చి పొలం దున్నిన ట్రాక్టర్‌కు ఇస్త. తతీమ పైసల్తోని మందుబస్తాలు తెచ్చుకుంట. కేసీఆర్ సార్ రైతుబంధు పెట్టినకాంచి ఒక్క నాటు, కలుపు, కోత కూలీలే నామీద పడ్తున్నయ్. ఈ పైసల్ నాకు మంచిగ ఉపయోగపడ్తున్నయ్. నా అసోంటి చిన్న రైతులకు చానా మంచి పథకమిది. ఐదారేండ్ల కింద మా అవ్వా నాయిన ఎవుసం చేసినపుడు ఈయింత పెట్టుబడి దొరకలే. వడ్డీకి పైసల్దెచ్చి ఎవుసం జేసెటోళ్లు. ఏపంట కాపంట మీద అప్పులు జేసెటోళ్లు. ఇప్పుడు వడ్డీ పైసలకుపోయ్యెటోళ్లే లేరు. మన తెలంగాణ మనకు వచ్చినంక కేసీఆర్ సార్ పెట్టిన పథకాలల్ల రైతుబంధు నిఖార్సైంది. రైతులు చానా సంతోషంగున్నరు. రైతులకు ఏది అవసరమో గది కేసీఆర్ సార్ ఇస్తున్నరు..
– ఎర్ర సంజీవ్, గోపాల్పూర్, కరీంనగర్‌రూరల్ మండలం
రైతులందరం రాజులుగా బతుకుతున్నం
రైతుబంధు డబ్బులు బ్యాంకు ఖాతాలో జమైనయ్. సీఎం కేసీఆర్ పాలనలో రైతులందరం రాజులుగా బతుకుతున్నం. అప్పట్లో కొద్దో గొప్పో చేతికొచ్చిన పంటకు గిట్టుబాటు ధర లేక విలవిల్లాడినం. రైతు కండ్లల్లో ఇప్పుడు ఎంతో మార్పును చూడగలుతున్నం. సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమాతో పాటు పుష్కలమైన సాగు నీళ్లు, నిరంతర కరెంటు, సకాలంలో ఎరువులు, విత్తనాలు, పంటకు మద్దతు ధర అందించడంతో గుండెనిండా ధైర్యంతో వ్యవసాయం చేసుకుంటున్నం. సీఎం కేసీఆర్ సారుకు రైతుల పక్షాన శతకోటి వందనాలు..
-అప్పాల శంకరయ్య, రైతు, ధర్మపురి
అప్పు జేసుడు తప్పింది
రాష్ట్ర సర్కారు ఇత్తున్న పెట్టుబడి సాయం అందింది. ముఖ్యమంతి కేసీఆర్ సారు రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడి రైతులకు రైతు బంధు ప్రవేశపెట్టి పెద్దన్నలెక్క నిలిచిండు. నాది సుల్తానాబాద్ మండలం తొగర్రాయి. నాకు 25 గుంటల భూమి ఉంది. అందులో వరి సాగు జేత్తున్న. గతం ఎవుసం పెట్టుబడికి అప్పు చేయాల్సి వచ్చేది కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రైతు బంధు ఇత్తున్నప్పటి నుంచి అప్పులు జేసుడు తప్పింది. కేసీఆర్ సారుకు రుణపడి ఉంటం.
-మాచేర్ల శ్రీనివాస్(రైతు)తొగర్రాయి
(సుల్తానాబాద్ రూరల్)
అన్నదమ్ముల ఆనందం
ఈ చిత్రంలో కనిపిస్తున్న అన్నదమ్ములు కొత్తపల్లి మండలం కమాన్‌పూర్‌కు చెందిన రుద్ర సాయికుమార్, రుద్ర రంజిత్‌కుమార్. తెలంగాణ సర్కారు అందించిన రైతు బంధు పైసలతో సాగుకు శ్రీకారం చుట్టారు. తమకున్న మూడెకరాలకు రైతుబంధు పైసలు రావడంతో ఇలా ఆనందంగా పొలంలో నాట్లు వేస్తున్నారు. గత ప్రభుత్వాలు ఎప్పుడూ రైతుల గురించి ఆలోచించలేదని, ఇలాంటి సహాయం ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు సంక్షేమ పథకాలతో వ్యవసాయం దండుగ అనే కాలం పోయి వ్యవసాయం అంటే పండుగలా మారిందన్నారు.
ఇప్పుడా పరిస్థితి లేదు
గతంలో షావుకారు దగ్గర ఎరువులు, మందులు, విత్తనాలు ఉద్దెర తీసుకుని వచ్చేది. పంట పండినంక ఎంతకో అంతకు అదే షావుకారికి పంటను ఇత్తుంటిమి. ఇప్పుడా పరిస్థితి లేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక కేసీఆర్ రైతుల కష్టాలను తెలుసుకొని పంట పెట్టుబడి అందిత్తుండు. నాకు ఎకరా 17 గుంటల భూమి ఉంది. రైతుబంధు రూ, 7,125 వస్తున్నయ్. వీటితో విత్తనాలు, ఎరువులను కొంటున్న. చదునుకు ఉపయోగిస్తున్నం. సాగు పెట్టుబడి వేరేటోళ్ల దగ్గర చేయిచాచకుండా ప్రభుత్వం ఆదుకుంటున్నది. నాకు ఇప్పటిదాకా పది విడుతల్లో రైతు బంధు వచ్చింది. రైతాంగానికి అండగా ఉంటున్న తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
-రామకిష్టు గంగాధర్, కొల్వాయి(బీర్పూర్)
ఎరువులకు అక్కరకస్తయ్
నాకు మల్లాపూర్ శివారులో ఉన్న 65 గుంటల వ్యవసాయ భూమిలో మక్క, ఆవ పంటలను పండిత్తున్న. నా అసోంటి పేద కుటుంబాలకు చెందిన రైతులకు సీఎం కేసీఆర్ రైతుబంధు పైసలిచ్చి మేలు జేత్తుండు. నాకు ఈ రోజు రూ.7750 ఖాతాలో వేసిండ్రు. ఈ పైసలతో ఎరువులను కొంటా. ఇలాంటి సమయంలో రైతుబంధు సాయం చాలా అక్కరకు వచ్చింది.
– పాలెపు గంగరాజు, మహిళా రైతు, మల్లాపూర్
ఎక్కడా ఇలాంటి పథకం లేదు
ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం ఏ రాష్ట్రంలో కూడా లేదు. మాది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల. నాకు ఎకరం భూమి ఉంది. అందులో వరి సాగు చేస్తున్న. నాకు రైతుబంధు రూ.5వేలు వస్తున్నయ్. నాట్లకు, మందు బస్తాలు, మిగతా పెట్టుబడికి ఈ పైసలు ఎంతో ఆసరా అయితయ్. రైతుల కోసం గింత చేస్తున్న ముఖ్యమంత్రి సారును జీవితాంతం గుర్తుంచుకుంటం. ప్రభుత్వానికి అండగా ఉంటం.
నిన్ననే పైసలు వడ్డయ్
మాది కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్. నా పేరు ర్యాకల లక్ష్మయ్య. నాకు 20 గుంటల పొలం ఉన్నది. తక్కువ భూమి ఉన్నదని నేను అప్పట్ల దున్నకపోయేది. నాకు కేసీఆర్ సార్ రైతుబంధు పథకం కింద పసలుకు 2,500 రూపాలు ఇస్తున్నడు. ఈ పైసలు వేస్ట్ చెయ్యద్దని నిర్ణయించుకుని నాలుగేండ్ల సంది నాకున్న 20 గుంటలు దున్ని నాటేస్తున్న. 18 నుంచి 20 బస్తాల వడ్లు వస్తున్నయ్. ఇన్ని తిండికి ఉంచుకుని తతీమై అమ్ముతున్న. నాకున్న కొద్ది భూమిల కేసీఆర్ సార్ ఇచ్చే పైసలుపోను ఇంకో రెండు వేల వరకు పెట్టువడి అయితంది. వరి పంట ఏసుకుంటె ఇంటికి ఏడాది సరిపడా బియ్యం వస్తన్నయ్. మిగిలిన వడ్లు అమ్మితే ఐదారు వేలు మిగులుతన్నయ్. కేసీఆర్ సార్ రైతుబంధు ఇస్తనే నా భూమిల నాటేయాల్ననే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనే ఇప్పుడు నా ఇంటి ఖర్సులు తగ్గించింది. ఇంతకన్న ఏంగావాలె. ఈ యాసంగికి నిన్ననే 2,500 రూపాలు పడ్డయి. ఇడిపిచ్చుకుందామని దుర్షేడుకు వచ్చిన. ఈసారి తొందర్గనే నాటేసిన. ఈ పైసలు కూలోళ్లకిస్త. ఇలాంటి పథకం నాలాంటోళ్లకు ఎంతో ఉపయోగవడ్తది. ఇట్లనే కొనసాగించాలె.
– ర్యాకల లక్ష్మయ్య, రైతు, బొమ్మకల్, కరీంనగర్‌రూరల్ మండలం
టైముకు అందచ్చినయి..
రైతు బంధు పైసలు టైముకు అందచ్చినయి.. ఆకలయ్యేటోనికి అన్నం పెట్టాలె.. ఆకలి పోయినంక అన్నం పెడితె పాయిదేముంటది అని మా నాయిన్న అనేది.. తెలంగాణ అచ్చినంక రైతుబంధు పథకం పెట్టి రైతులకు పెట్టువడికోసం పైసలు బ్యాంకులేసుడు చాలా గొప్ప ముచ్చట. సీఎం కేసీఆర్ సార్ చాలా ముందుచూపుతోటి రైతులను ఆదుకునెటందుకు ఈ పథకం పెట్టిండు. ఈ పథకం చెయ్యవట్టి, రైతులకు మస్తు సౌలత్ అవుతంది. మునుపు ఆనకాలం, ఎండకాలం పంటలకు పెట్టువడి కోసం ఆసాముల దగ్గరికి, ఊళ్లె ఉన్న షావుకార్ల దగ్గరికి పోతుంటిమి. వాళ్ల దగ్గరికి పోయి పైసలు అడిగినంకనే పనులు మోపుజేత్తుం.. ఇప్పుడా రంధి లేకుండవోయింది. యాడాదికి రెండుతాపల పైసలు పడుతూనే ఉన్నయి. నేను మూడెకరాల్లో పొలం ఏత్తున్న. పొలం దున్నించిన. ట్రాక్టరాయన పైసలు ఇయ్యమని అడుగుతుండు. టైముకు పైసల్లేవు.. ఎట్లరా అని అనుకుంటున్న. ఈరోజు పైసలు బ్యాంకుల పడ్డయని మెసేజచ్చింది. పైసలు తీసుకొని ట్రాక్టర్ ఆయనకు ఇచ్చిన.. రైతులకు టైముకు పైసలు అందెటట్లు చేసిన సీఎం కేసీఆర్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటం.
-కసాడి మల్లేశం, రైతు, కొడిమ్యాల
రైతు కష్టం తెలిసిన కేసీఆర్
నాకు 6 ఎకరాల 20 గుంటల భూమి ఉన్నది. నా బ్యాంకు ఖాతాలో డబ్బులు పడినట్లు ఫోన్‌కు శుక్రవారం పొద్దుగాల మెసేజ్ వచ్చింది. వెంటనే బ్యాంకుకు పోతే రైతుబంధు కింద రూ. 32,500 వచ్చినట్లు చెప్పిండ్రు. చాల సంతోషమైంది. రైతు కష్టం విలువ తెలిసిన కేసీఆర్ మన ముఖ్యమంత్రిగా ఉండడం మన అదృష్టం. రైతుబంధు పైసలతో యాసంగి సాగుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటం. గతంలో టైంకు పైసలు లేక ఎరువులు, నాట్ల చాల ఇబ్బంది అయితుండే. ఇంకా ఎరువులు కొనడానికి, నాట్లేసేందుకు పైసలకు ఏ ఇబ్బందులు లేవు. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక రైతులకు కష్టాలు తీరినయ్..
– బాణాల లక్ష్మారెడ్డి, కిష్టంపేట, చందుర్తి
సాగుకు సర్కారు అండ
సాగు సమయంలో కేసీఆర్ సర్కారు రైతులకు అండగా నిలుస్తున్నది. సీఎం కేసీఆర్ రైతుల కష్టాలను గుర్తించి ఫసలుకు ఎకరానికి రూ.5వేలు పంటపెట్టుబడి కింద ఇస్తుండు. టైంకు పైసలు పడుతున్నయ్. నాకు ఎకరం 36 గుంటల పొలం ఉంది. పంట పెట్టుబడి సాయం కింద రూ, 8,625 వస్తున్నయ్. వీటిని చదునుకు, కైకిళ్లకు, ఎరువులకు ఉపయోగిస్తున్న. రైతులకు అండగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఉంటాం.
-రామకిష్టు నర్సయ్య, రైతు,కొల్వాయి(బీర్పూర్)