Robbery | శంకరపట్నం : మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న జనరల్ స్టోర్లో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు రూ.40 వేల విలువైన సామాగ్రి తో పాటు నగదు దోచుకెళ్లారు. బాధితుడి కథనం ప్రకారం.. శంకరపట్నం మండలంలోని కరీంపేట గ్రామానికి చెందిన కారుకూరి శ్రీనివాస్ అనే వ్యక్తి రెండున్నర సంవత్సరాలుగా మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో రేకుల టేలాలో జనరల్ స్టోర్ తో పాటు జిరాక్స్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఎప్పటిలాగే శుక్రవారం రాత్రి శ్రీనివాస్ షాపు మూసి తాళం వేసి ఇంటికి వెళ్ళాడు.
శనివారం తెల్లవారుజామున పేపర్ బాయ్ టేలా తెరిచి ఉండటం చూసి శ్రీనివాస్ కు సమాచారం అందించాడు. వెంటనే స్టోర్కు వెళ్లి చూడగా తాళం పగలగొట్టబడి ఉంది. గుర్తుతెలియని దుండగులు భద్రపరిచిన రూ.17 వేల నగదుతో పాటు విక్రయించే హెల్మెట్లు ఇతర సామాగ్రిని ఎత్తుకెళ్లారు. సుమారు రూ.40 వేల విలువ చేసే సొత్తును ఎత్తుకెళ్లినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ట్రైనింగ్ ఎస్సై సుమన్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. దర్యాప్తులో భాగంగా సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.