ప్రశాంతంగా ఉన్న కరీం‘నగరం’ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నగరం నడిబొడ్డున దోపిడీ దొంగల బీభత్సంతో హడలిపోయింది. కాల్పుల మోతతో కలకలం రేగింది. ఆదివారం ఉదయం 11గంటల ప్రాంతంలో జ్యోతినగర్‌లోని పీఎంజే జ్యువెల్లరీలో ఐదుగురు దుండగుల ముఠా దోపిడీకి పాల్పడింది. ప్రతిఘటించిన సిబ్బందిపై కాల్పులకు తెగబడింది. భారీ మొత్తంలో నగలను దోచుకెళ్లింది. ఉదయం పూటే.. అందరూ చూస్తుండగానే కొల్లగొట్టగా.. ఈఘటన రాష్ట్రంలోనే సంచలనం రేపింది. నాకాబందీ నిర్వహించిన గంటల వ్యవధిలోనే ఈ దోపిడీ జరగడం పోలీసులకు సవాల్ విసరగా.. ప్రజల భద్రతను తెరపైకి తెస్తున్నది. పోలీస్, ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఏం చేస్తున్నాయన్న ప్రశ్నలు వస్తున్నాయి. సంఘటన జరగడానికి ముందే అదే ప్రాంతంలో కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ అభివృద్ధి పనులు ప్రారంభించగా, ఆయన భద్రత పరిశీలించే పోలీస్ వ్యవస్థ ఏం పరిశీలన చేసిందన్న విమర్శలు వస్తున్నాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ పరిధిలో 770 పైగా సీసీ కెమెరాలు, నగరంలో వేల సంఖ్యలో ప్రైవేట్‌గా ఉన్న సీసీ కెమెరాలు ఉన్నా.. దుండగులు ఉదయం పూటే దోపిడీకి పాల్పడడం చర్చకు దారి తీస్తున్నది.
అది ఆదివారం ఉదయం 11గంటల సమయం.. అత్యంత రద్దీగా ఉండే కరీంనగర్‌లోని జ్యోతినగర్ ప్రాంతం.. కేంద్ర మంత్రి సంజయ్ ఆఫీస్‌కు కూతవేటు దూరంలో ఉన్న పీఎంజే జ్యువెల్లరీ దుకాణం.. ఒక్కసారిగా కాల్పుల కలకలం.. దోపిడీ దొంగల బీభత్సంతో భయానకం.. భారీగా నగల లూటీ.. 12 నిమిషాల వ్యవధిలోనే ఉడాయింపు.. సినీ ఫక్కీలో జరిగిన ఈ భారీ దోపిడీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ప్రశాంతంగా ఉన్న కరీంనగర్లో ప్రజల భద్రతను తెరపైకి తెచ్చింది.

కరీంనగర్ కార్పొరేషన్/ విద్యానగర్, మే 3 : కరీంనగర్ జ్యోతినగర్‌లోని పీఎంజే జ్యువెల్లరీలో దోపిడీ సంచలనం రేపింది. ఐదుగురు దుండగుల ముఠా పక్కా రెక్కీ నిర్వహించి దోపిడీకి పాల్పనట్టు తెలుస్తున్నది. ఒక్కో వ్యక్తి కస్టమర్లా దుకాణంలోని ఎంటర్ అయి.. ఆభరణాలు చూపించాలంటూ మాటల్లోకి దింపారు. నగలు చూపించే క్రమంలోనే గన్‌తో బెదిరించారు. ఈ క్రమంలో నగల షాపు ఇన్చార్జి ముస్తాక్, సిబ్బంది కమలాసన్, రాజేశ్, మధూకర్ ప్రతిఘటించడంతో కాల్పులు జరిపారు. తర్వాత అక్కడున్న అందరినీ ఒకే చోటకు తీసుకొచ్చి మోకాళ్లపై కూర్చోబెట్టి చేతులు కట్టేసి, మూతులకు ప్లాస్టర్ వేశారు. ఇద్దరు దుండగులు వీరికి కాపలా ఉండగా.. ముగ్గురు దుండగులు నగలను సర్దుకున్నారు. ఈ సమయంలో సిబ్బంది భయాందోళనకు గురై అరవడంతో దుండగలు అక్కడి నుంచి బయటకు వెళ్లి, బ్లాక్ కలర్ పల్సర్, వైట్ కలర్ అపాచీ బైక్‌లపై పారిపోయారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు.
దుండగులు మొత్తం మూడు సంచుల్లో నగలను నింపుకొన్నట్టు తెలుస్తుండగా, రెండుసంచులు అక్కడే పడేసి ఒక సంచిని మాత్రమే తీసుకెళ్లినట్టు గుర్తించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా ఉదయం 11.01 నుంచి 11.13 గంటల వరకు దోపిడీ జరిగినట్టు నిర్ధారించారు. కరీంనగర్ సీపీ గౌష్ ఆలంతో కలిసి సంఘటన స్థలాన్ని తెలంగాణ మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. అనంతరం స్థానిక దవాఖానకు వెళ్లి, బాధితులను పరామర్శించారు. సంఘటన తెలియగానే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నగల దుకాణానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దవాఖానల్లో బాధితులను పరామర్శించారు.

ప్రజల భద్రతపై దృష్టి పెట్టండి
కరీంనగర్ రాష్ట్రంలోనే రెండో సిటీగా ఎదిగింది. నిన్నటి వరకు సేఫ్ సిటీగా ఉన్నది. కానీ, ఇప్పుడు జ్యువెల్లరీలో జరిగిన దోపిడీతో ఆభరణాల సంస్థలు భయాందోళనకు గురయ్యే పరిస్థితి వచ్చింది. మహిళలు కూడా నగలు వేసుకోవడం కాదు ఇంట్లో పెట్టుకోవడానికే భయపడే పరిస్థితి వచ్చింది. నాకాబందీ జరిగిన 12 గంటల్లోనే దోపిడీ దొంగలు పోలీసులకు సవాల్ చేశారంటే ఇది ఎవరి ఫెయిల్యూర్? ప్రభుత్వం ఇప్పటికైనా కండ్లు తెరవాలి. ప్రజల భద్రతపై దృష్టి పెట్టాలి. ఇక ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలి. ప్రజల్లో నమ్మకం కల్పించేలా చర్యలు తీసుకోవాలి. దోపిడీ దొంగలను సత్వరమే దొరకపట్టే విధంగా చర్యలు తీసుకోవాలి. పొద్దున లేస్తే ఆర్సీ ఉన్నదా? ఫెనాల్టీ ఉన్నదా? చెట్ల మధ్య ఉండి ఫొటోలు కొట్టడం కాదు. అదే చెట్ల మధ్య నుంచి ఇలాంటి అసాంఘిక శక్తులను కొట్టాలి. దోపిడీ ఘటనలో గాయపడిన కుటుంబాలను ఆదుకోవాలని పీఎంజే సంస్థ అధినేతలను కోరుతాం.
– విలేకరులతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్

ఇదేనా ప్రజలకు భద్రతా..?
కేంద్ర మంత్రి సంజయ్ ఇంటి నుంచి కూత వేటు దూరంలోనే దోపిడీ జరగడం అంటే.. భద్రత అనేది ఉన్నదా.. లేదా? అన్న అనుమానం కలుగుతున్నది. అసలు ఇక్కడ పోలీసులు ఉన్నట్టా.. లేన్నట్టా? రాష్ట్ర హోం మంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి పాలనలో ఇదేనా ప్రజలకు భద్రత..? కేసీఆర్ నాయకత్వంలో అసెంబ్లీ సాక్షిగా నెల క్రితం నేను కరీంనగర్లో పోలీస్ పూర్తిగా విఫలమైందని సీఎం రేవంత్‌రెడ్డికి చెప్పాను. ప్రజల భద్రత డేంజర్లో ఉందని చెప్పిన. అయినా సీఎం యాక్షన్ తీసుకోలేదు. ముందుగానే స్పందించి శాఖాపరమైన చర్యలు తీసుకొని ఉంటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదు. దుండగుల కాల్పుల్లో గాయపడిన నలుగురికి ఏమైనా అయితే బాధ్యత ఎవరిది? సీఎం, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏం చేస్తున్నారు?
– విలేకరులతో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి
నాకాబందీ జరిగిన గంటల్లోనే..
నగరంలో పోలీసుల నిఘా తీరుపై విమర్శలు వస్తున్నాయి. నాకాబందీ పేరిట నిత్యం వాహనదారులను ఆర్సీలు, ఇతర వాటి పేరిట పరిశీలనలు చేస్తున్నా.. దొంగతనాలు, అసాంఘిక శక్తులపై నిఘా ఏ మేరకు చేపడుతున్నారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం నాకాబందీ నిర్వహించిన గంటల వ్యవధిలోనే దోపిడీ జరగడం భద్రతపై ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. నగరంలో ఎక్కడిక్కడ వాహనాలను చెక్ చేసే పోలీస్ అధికారులు, వాహనాలపై ఉన్న పెనాల్టీలు, ఇతర వాటిపై దృష్టి పెడుతున్నా.. అసలు ప్రజల భద్రత విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. నిత్యం నిఘా కొనసాగించాల్సినా.. ఆ దిశగా ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. దుండగులు దర్జాగా ఉదయం పూటే షాపుల్లోకి వెళ్లి దాడి చేసి, నగలు దోచుకెళ్లారంటే ఎంత పకడ్బందీగా రెక్కీ నిర్వహించారోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలోకి వస్తున్న అపరిచితులపై దృష్టి పెట్టాల్సినా పోలీసులు ఈ దిశగా ఎలాంటి చర్యలు చేపడుతున్నారన్న విషయమై ప్రజల్లో చర్చ మొదలైంది.

కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉన్నట్టా.. లేన్నట్టా..
స్మార్ట్‌సిటీలో భాగంగా కరీంనగరంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. శాంతిభద్రతల పర్యవేక్షణతోపాటు అసాంఘిక చర్యల అడ్డుకట్ట కోసం 770కి పైగా సీసీ కెమెరాలను ఈ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించారు. అయితే ఈ కంట్రోల్ సెంటర్ ద్వారా సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు పరిశీలించాల్సిన పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నదన్న విమర్శలు వస్తున్నాయి. నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో ఉన్న ఈ సెంటర్‌కు పోలీసులు ఎప్పుడు వచ్చి కెమెరాలను పరిశీలించిన దాఖలాలు లేవన్న విమర్శలు ఉన్నాయి. గతేడాది సీసీ కెమెరాల ద్వారా ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించని వాహనదారులపై భారీగానే జరిమానాలు విధించామని స్వయంగా పోలీస్ అధికారులే పేర్కొనడం చూస్తే.. ప్రజల భద్రత కోసం ఉపయోగించాల్సిన ఈ కెమెరాలను వాహనదారులపై ఫైన్లు వేయడానికి మాత్రమే వాడుతున్నట్టు అర్థమవుతున్నది. సీసీ కెమెరాల పనితీరుపై పర్యవేక్షణ లేకుండా పోయినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం ఓ ప్రైవేట్ సంస్థ యజమాన్యం కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను పర్యవేక్షిస్తున్నది. నిత్యం సీసీ కెమెరాల ద్వారా నగరంలో శాంతిభద్రతలు పరిశీలించే అవకాశం ఉన్నా పోలీసు విభాగం ఆ దిశగా ఎందుకు దృష్టి సారించలేదన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత కీలకమైన కంట్రోల్ సెంటర్ విషయంలో ఇప్పటి వరకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో వినియోగించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చేతులు కాలాకా..?
దుండగులు నగల షాపులో దోపిడీకి పాల్పడ్డ తర్వాత పోలీసులు ఇప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఆ మేరకు ప్రత్యేక బృందం కమాండ్ కంట్రోల్‌కు వెళ్లి.. సీసీ ఫుటేజీలను పరిశీలించినట్టు తెలిసింది. చేతులు కాలాకా.. ఆకులు పట్టుకున్న చందాన పోలీసుల పనితీరు ఉందన్న విమర్శలు వస్తున్నాయి. ఆది నుంచే కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీసీ కెమెరాలను పూర్తిస్థాయిలో పరిశీలిస్తే ఇలాంటి సంఘటనలు జరగకుండా అడ్డుకునే అవకాశాలు ఉండేవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో సీసీ కెమెరాల ద్వారా వాహనాలకు జరిమానాలు విధిస్తున్న పోలీస్ వ్యవస్థ, నగరంలోకి వచ్చే అనుమానాస్పద వ్యక్తులపై దృష్టి పెడితే నగరంలో భద్రతకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్న అభిప్రాయాలు ప్రజల నుంచి వస్తున్నాయి.

సమాచారం ఇస్తే లక్ష బహుమతి
దోపిడీ దొంగలను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో హై అలర్ట్ ప్రకటించి, ప్రతి పోలీసస్టేషన్కూ సమాచారం ఇచ్చి అప్రమత్తం చేశారు. అలాగే పీఎంజే జ్యువెల్లరీ దోపిడీకి సంబంధించి సీసీ ఫుటేజీతోపాటు నిందితుల ఫొటోలను విడుదల చేశారు. గ్రామాలు, పట్టణాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ప్రకటన జారీ చేశారు. సంబంధిత దొంగలు బ్లాక్ కలర్ పల్సర్, వైట్ కలర్ అపాచీ బైక్‌లపై తిరుగుతున్నారని తెలిపారు. సీసీ ఫుటేజీలో కనిపించిన వ్యక్తులను ఎవరైనా గుర్తించినా లేదా వారికి సంబంధించిన సమాచారం ఉన్నా వెంటనే పోలీస్ అధికారులకు డయల్ 100, లేదా 8712670744, 8712670745 నంబర్లకు తెలుపాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారికి లక్ష రూపాయల బహుమానం ఇస్తామని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ప్రకటించారు.
నేడు కరీంనగర్‌కు కేటీఆర్
దోపిడీ ఘటన బాధితులకు పరామర్శ
కరీంనగర్ కార్పొరేషన్, మే 3 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ సోమవారం కరీంనగర్‌కు వస్తున్నారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 2.30 గంటలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయానికి కేటీఆర్ చేరుకోనున్నారు. అనంతరం 3 గంటలకు పీఎంజే జ్యువెల్లరీ దోపిడీ ఘటనలో గాయపడి దవాఖానల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. 3.30 గంటలకు పీఎంజే నగలషాపును పరిశీలిస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతారు. అనంతరం సాయంత్రం 5గంటలకు సిరిసిల్లకు వెళ్లనున్నారు. తెలంగాణ భవన్లో చేరికల కార్యక్రమంలో పాల్గొని, 10వ వార్డు కౌన్సిలర్ బోల్గం వైష్ణవి నాగరాజు దంపతులను పార్టీలోకి ఆహ్వానిస్తారు. ఆ తర్వాత పలు కార్యక్రమాల్లో పాల్గొననుండగా, బీఆర్ఎస్ నాయకులు అందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.