కరీంనగర్, జూలై 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉచిత విద్యుత్‌పై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపుతున్నాయి. నాటి కష్టాలన్నీ తొలగి ఇప్పుడిప్పుడే సంబురంగా సాగు చేసుకుంటున్న తరుణంలో రైతులను అవమానించేలా మాట్లాడిన మాటలు కల్లోలం సృష్టిస్తున్నాయి. రేవంత్ తీరుపై భగ్గుమన్న రైతాంగం, రెండు రోజుల నుంచి నిరసనలతో హోరెత్తిస్తున్నది. రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతూ.. రైతు వేదికల సాక్షిగా ప్రశ్నలు సంధిస్తున్నది. ఈ పరిస్థితుల్లో సమాధానం చెప్పలేక కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో అంతర్మథనం మొదలైంది. రైతాంగం కన్నెర్ర చేస్తూ.. తీర్మానాలతో తన సంఘటిత శక్తిని చాటుతున్న తీరును చూసి కలవరపడుతున్నది. పీసీసీ అధ్యక్షుడి తీరుతో ఇప్పటికే రచ్చ రచ్చ అయిందని, ఉచిత విద్యుత్‌పై ఇంకా ప్రేలాపణలు చేస్తే ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నది. బీజేపీ కనుమరుగవుతున్న సమయంలో పార్టీని బలపరుచుకోవాల్సింది పోయి, కాంగ్రెస్‌ను సైతం ఖతం చేస్తున్నారని అభిప్రాయపడుతున్నది.
ఉచిత విద్యుత్ విషయంలో ఇటీవల పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రైతులకు 24 గంటల విద్యుత్ అవసరం లేదని, మూడు ఎకరాలు పారేందుకు మూడు గంటలు మాత్రమే చాలని, తాము అదే మార్గంలో వెళ్తామని అమెరికాలో మాట్లాడిన విష యం విదితమే. అయితే, ఈ వ్యాఖ్యలు పెద్ద దు మారమే లేపాయి. ‘తాను చేయదు.. ఇంకొకరు చేస్తే ఓర్వదు’ అన్న చందంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు.. కాంగ్రెస్ పార్టీ 41 ఏండ్లు పాలించినా ఏనాడూ రైతులను ఆదుకునే దిశగా చిత్తశుద్ధితో చర్యలు చేపట్టలేదన్న విమర్శలున్నాయి. అలాగే, నాడు ఉచిత విద్యుత్ తొమ్మిది గంటలు ఇస్తామని చెప్పి, ఏనాడూ నిరంతరాయంగా ఐదు గంటలు కూడా ఇవ్వలేదు. అందులోనూ నాణ్యమైన కరెంటు ఇవ్వకపోవడంతో ట్రాన్స్ఫార్మర్లు, కరెంటు మోటర్లు కాలిపోయి అన్నదాతలు అవస్థలు పడాల్సి వ చ్చింది. ఆనాడు ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినా ఆ పరిధిలోని రైతులే తలా ఇంత డబ్బులు పోగుచేసుకొని బాగు చేసుకోవాల్సిన దుస్థితి ఉండేది. ప్రధానంగా ఏడాదిలో ఒక్కోరైతు మోటరు కనీసం రెండు సార్లు కాలిపోయేది. అలాగే, కరెంటు ఎప్పు డు వస్తుందో.. పోతుందో తెలియక రాత్రింబవళ్లు నిద్రాహారాలు మానిన రోజులను రైతులు గుర్తు చేసుకుంటున్నారు. చేతికొచ్చే పంట కరెంటు లేక ఎండిపోయి నష్టపోయినా ఆనాటి దృశ్యాలు నేటికీ కండ్లముందు మెదులుతున్నాయని చెబుతున్నారు.
కష్టాలను దూరం చేసిన కేసీఆర్
అన్నదాతలు అడుగడుగునా ఎదుర్కొన్న విద్యుత్ కష్టాలను దూరం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, 2018 జనవరి ఒకటో తేదీ నుంచి 24 గంటల ఉచిత కరెంటును అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దేశంలోనే ఈ తరహా విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. నిజానికి 2017 జూలై 18 నుంచి నవంబర్ వరకు ముందుగా కరీంగనర్ ఉమ్మడి జిల్లాలో ప్రయోగత్మకంగా ఉచిత విద్యుత్‌ను అమలు చేశారు. ఆ తర్వాత 2018 జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తెచ్చారు. అప్పటి నుంచి రైతులు రంది లేకుండా.. పంటలకు కావాల్సినంత పవర్‌ను ఉచితంగా వాడుకుంటున్నారు. అదే సమయంలో రైతులు ఆర్థికంగా నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ సరఫరాకు కావాల్సిన మౌలిక సదుపాయాలను ఒక ప్రణాళికాబద్ధంగా క్షేత్రస్థాయిలో కల్పించింది. సబ్స్టేషన్ల నుంచి మొదలుకొని.. ట్రాన్స్ఫార్మర్ల వరకు అన్ని పనులూ పూర్తి చేసి సరఫరాలో ఇబ్బంది లేకుండా చేసింది. నాణ్యమైన కరెంటు రావడంతో ట్రాన్స్ఫార్మర్లే కాదు, మోటర్లు కాలిపోవడం ఆగిపోయింది. ఈ 24 గంటల ఉచిత విద్యుత్ అన్నదాతల్లో ఒక ధీమాను పెంచింది. అర్ధరాత్రి బాధలు తప్పగా, రైతులు తమకు వీలైనప్పుడు పొలానికి వెళ్లి నీరు పెట్టుకోవడం కనిపిస్తున్నది. మరోవైపు ప్రతి జిల్లాలోనూ సాగు విస్తీర్ణం డబుల్ అయింది. రాష్ట్రంలో అమలవుతున్న 24 గంటల ఉచిత విద్యుత్ విధానాన్ని పరిశీలిస్తున్న చాలా రాష్ర్టాలు, తమ ప్రాంతాల్లో అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.
ప్రశ్నిస్తున్న రైతాంగం..
సజావుగా సాగుతూ.. రైతులకు మనోనిబ్బరాన్ని ఇస్తున్న నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రైతాంగానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ రైతులు కన్నెర్రజేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రెండు రోజులుగా రైతు వేదికల వద్ద జరుగుతున్న సమావేశాలకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ముక్త కంఠంతో కాంగ్రెస్ తీరును ఎండగడుతున్నారు. రైతుల పాలిట మొసలి కన్నీరు కారుస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఉచిత విద్యుత్ ఎందుకు మంచిది కాదో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మూడు గంటల పవర్‌తో మూడెకరాలు పారిస్తామంటూ రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలు, ఆచరణలో ఏ కాంగ్రెస్ నాయకుడైనా నిరూపిస్తారా..? వ్యవసాయంపై అవగాహన ఉన్నవారెవ్వరైనా ఇలా మాట్లాడుతారా..? చేతకాక పోతే తాము అధికారంలోకి వస్తే 24 గంటల కరెంటు ఇవ్వలేమని చెప్పే ధైర్యం ఎందుకు చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ కోసం రోజూ ఏదో చోట ఆందోళన చేశామని, ధర్నాలు, రాస్తారోకోలతో రోడ్డెక్కామని గుర్తు చేశారు.
కానీ, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఏనాడైనా విద్యుత్ కోసం రైతులం రోడ్డు ఎక్కామా..? ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి బాధ పడిన సందర్భాలున్నాయా..? సాగు రెండు మూడింతలు పెరిగినా.. ఆగకుండా నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా..? 41 ఏండ్లు ఈ ప్రాంతాన్ని పాలించింది కాంగ్రెస్ పార్టీయే కదా..? ఆనాడు ఈ సమస్యను ఎందుకు పరిష్కరించలేదు? 24 గంటలు ఎందుకు ఇవ్వలేదు? పోనీ కాంగ్రెస్ గతంలో చెప్పినట్లు తొమ్మిది గంటలైనా నిరంతరాయంగా ఇచ్చారా..? వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో బాగుపడుతున్న తమ బతుకులను మళ్లీ చీకట్లోకి నెట్టేందుకు కాంగ్రెస్ కుట్రలు పన్నుతుందన్న ఆక్రోశం, ఆవేదన రైతుల్లో కనిపిస్తున్నది. నిజానికి రైతులు సంధిస్తున్న ప్రశ్నలకు ఏ కాంగ్రెస్ నాయకుడు సమాధానం చెప్పలేని పరిస్థితి. దీంతో ముందుకు వెళ్లలేక, అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆ పార్టీ శ్రేణులు కలవరపడుతున్నాయి. రేవంత్ చేసిన వ్యాఖ్యల వల్ల ఇప్పటికే రచ్చ రచ్చ అయిందని, ఇంకా ఉచిత విద్యుత్‌పై ప్రేలాపణలు చేస్తే ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందనే ఆందోళన కాంగ్రెస్‌లో కనిపిస్తున్నది. రైతులు సంధిస్తున్న ప్రశ్నలతో కాంగ్రెస్‌లో అంతర్మమథనం మొదలైందని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. అంతేకాదు, రేవంత్ వ్యాఖ్యలు కాంగ్రెస్ ఖతం చేస్తున్నాయన్న అభిప్రాయాలు, చర్చలు ప్రస్తుతం ఆ పార్టీలో జోరుగా నడస్తున్నాయి.