గతంలో ఓటుకు నోటు కేసులో దొరికి, ఇవాళ గాంధీ కుటుంబానికి వెయ్యి కోట్లు అని రేవంత్‌రెడ్డి ఓపెన్‌గా చెప్తుంటే బీజేపీ ఏం చేస్తున్నది?. ఈడీ, సీబీఐ, ఐటీ ఏం చేస్తున్నయ్? రెండేండ్లుగా కాంగ్రెస్ సర్కార్ అవినీతికి బీజేపీ రక్షణ కవచంలా ఉంటూ ఎందుకు కాపాడుతున్నదో సమాధానం చెప్పాలి.
– కేటీఆర్
ఆదిలాబాద్, ఫిబ్రవరి 24(నమస్తే తెలంగాణ) : గాంధీ కుటుంబానికి రూ.వెయ్యి కోట్లు ఇస్తామంటూ ముఖ్యమంతి రేవంత్‌రెడ్డి ఓపెన్‌గా చెబుతుంటే బీజేపీ ఏం చేస్తున్నదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మాట్లాడిన ప్రధాని మోదీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కార్ అవినీతికి బీజేపీ రక్షణ కవచంలా ఎందుకు కాపాడుతున్నదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ దోపిడీ బ్రహ్మాండంగా చేస్తున్నాడని, ఢిల్లీకి ఇవ్వడానికి వెయ్యి కోట్లు ఉన్నాయంటే.. రెండేండ్లలో ఎన్ని వేల కోట్లు దోచుకున్నాడో ప్రజలు ఆలోచించాలని కోరారు.
మంగళవారం ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న మాజీ ఎంపీ బాల్క సుమన్, ఇతర నాయకులను కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, సంజయ్, గుంగుల కమలాకర్, అనిల్ జాదవ్, వివేకానంద, మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు సీనియర్ న్యాయవాది క్యామ శ్రీకాంత్, నాయకులు గ్యాదరి కిశోర్, కోనేరు కోనప్ప, దుర్గం చిన్నయ్యలతో కలిసి పరామర్శించారు. ఆ వెయ్యి కోట్లు ఎక్కడివో రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజానీకానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ డబ్బులు తెలంగాణ ప్రజల రక్తమాంసాలు కాదా? ప్రజల చెమట కాదా? అని ప్రశ్నించారు.
విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా బీఆర్ఎస్ నేతలను బెదిరించి, ప్రజాతీర్పును అపహాస్యం చేస్తూ కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న దురాగతాలను రాష్ట్రం, దేశం గమనిస్తున్నదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కూటమి 14 స్థానాల్లో స్పష్టమైన మెజారిటీ వస్తే.. కాంగ్రెస్ ఏడు స్థానాలు మాత్రమే గెలుచుకున్నదని కానీ ముఖ్యమంత్రి సూచనలు, మంత్రి వివేక్ దురాగతాలతో అధికార యంత్రాంగం తొత్తులుగా వ్యవహరించి ప్రజాతీర్పును అపహాస్యం చేశారని మండిపడ్డారు.
దుర్మార్గాలు, కిడ్నాప్‌లు, బెదిరింపులు, ప్రలోభాలకు గురిచేసినా వెరువకుండా క్యాతనపల్లిలో 14మంది కౌన్సిలర్లు పొత్తు ధర్మాన్ని వీడలేదని పేర్కొన్నారు. మంత్రి వివేక్ ప్రలోభాలకు గురిచేసినా బీఆర్ఎస్ కౌన్సిలర్లు నిజాయితీగా వ్యవహరించారని.. తాము కేసీఆర్, సుమన్ నాయకత్వంలో క్యాతనపల్లిలో గులాబీ జెండా ఎగురవేస్తామని ముందుకొచ్చారని కేటీఆర్ కొనియాడారు. ఎన్ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేసినా వెనక్కి తగ్గకుండా పొత్తు ధర్మాన్ని పాటించినందుకు సీపీఐ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
కౌన్సిలర్లు దర్శనానికి భద్రాచలం వెళ్లినా అక్కడికీ కాంగ్రెస్ గూండాలు వచ్చి దాడి చేయడమే గాక కౌన్సిల్ హాల్‌కు తాగివచ్చి కాంగ్రెస్ కౌన్సిలర్లు బీఆర్ఎస్, సీపీఐ మహిళా కౌన్సిలర్లతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నా అక్కడే ఉన్న మంత్రి, ఎంపీలు నవ్వారు తప్ప వారించే ప్రయత్నాలు చేయలేదంటూ నిప్పులు చెరిగారు. ఇంత చిల్లర రాజకీయం దేశ చరిత్రలో ఎక్కడా జరుగలేదని, జనగామలో మున్సిపల్లో బీఆర్ఎస్ మహిళా కౌన్సిలర్ చేతిని వెనుక ఉన్న కాంగ్రెస్ కౌన్సిలర్ బలవంతంగా ఎత్తే ప్రయత్నం చేశారని ఇంత దిగజారుడు రాజకీయం ఎక్కడా లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు.

పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, రాజిరెడ్డితో పాటు ఆరుగురిని జైలులో పెట్టారని.. మరి కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి నోటికొచ్చినట్టు పోలీసులను బూతులు తిట్టినా కేసు ఉండదా? అని ప్రభుత్వాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. ‘బూతులు మాట్లాడినా కేసు పెట్టే దమ్ము పోలీసు యంత్రాంగానికి లేదు. నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ పోలీసులను యూజ్లెస్ ఫెల్లోస్ అంటే కేసులు ఉండవు. క్యాతనపల్లిలో స్థానిక మంత్రి, అధికార యంత్రాంగం కుమ్మకయ్యారు. ఎన్నికల కమిషన్ చేయాల్సిన పనిచేయకపోతే మా కార్యకర్తలు ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తే ఉల్టా మా మీద కేసులు పెట్టి మా నాయకులను జైలులో పెట్టారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నరు’ అని చెప్పారు.
బాల్క సుమన్‌కు జైలు కొత్త కాదని, తెలంగాణ ఉద్యమంలో పది సార్లు జైలుకు వెళ్లాడని.. టాస్క్‌ఫోర్స్ ఆఫీసులు, పోలీస్స్టేషన్లు అయితే లెక్కలేదని కేటీఆర్ తెలిపారు. సుమన్‌ను, ఇతర నాయకులను జైలులో పెడితే భయపడుతారని ముఖ్యమంత్రి రేవంత్ అనుకుంటున్నాడని.. కానీ రేవంత్‌రెడ్డే మళ్లీ చిప్పకూడు తినే టైం వస్తుందని హెచ్చరించారు. 2023లో బీఆర్ఎస్కు 39 వచ్చినా పదేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఒక్క క్షణం ప్రగతిభవన్‌లో ఉండకుండా వెళ్లిపోయి ప్రజాస్వామ్యాన్ని గౌరవించారని కేటీఆర్ గుర్తుచేశారు.
బీఆర్ఎస్ 2014లో 63 సీట్లతో గెలిచి వచ్చినప్పుడు, అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు విజ్ఞత ప్రదర్శించి జానారెడ్డి మర్యాదతో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత తీసుకున్నారని పేర్కొన్నారు. ‘అది రాజనీతి, రాజనీతిజ్ఞత అంటే. అది ధర్మాన్ని పాటించడం, ప్రజల తీర్పును గౌరవించడం అంటే. మాకు 25 నుంచి 30 మున్సిపాలిటీలు రావాలి. కానీ.. మీరు వెకిలి పనులు చేస్తున్నారు.’ ఇలాంటి అరాచకాలు ప్రజాస్వామ్యంలో మంచివి కావంటూ మండిపడ్డారు.
‘సీఎం రేవంత్‌రెడ్డి, డీజీపీ శివధర్‌రెడ్డికి చెబుతున్నా. మాకు రెడ్ బుక్ ఉండదు, పింక్ బుక్ ఉండదు, ఖాకీ బుక్ ఉంటుందని డీజీపీ మొన్న సినిమా డైలాగ్‌లు చెప్పారు. ఇదేనా నీ ఖాకీ బుక్కు, నీ పోలీసోళ్ల బట్టలు ఊడదీసి కొడుతా అని కాంగ్రెస్ నాయకుడు అంటే కేసు ఉండదు. యూజ్లెస్ ఫెల్లోస్ అన్నా కేసు పెట్టే ధైర్యం లేదు. కానీ మేం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కేసులు పెడుతవా? ఒకటి గుర్తుపెట్టుకోండి, అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. టైం వస్తుంది. రెండేండ్లలో మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారు. అరాచకాలు చేసిన మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే ఎవరినీ వదిలిపెట్టం’ అని హెచ్చరించారు. క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం, ఖానాపూర్‌తో పాటు పెండింగ్‌లో ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిజాయితీగా నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ను కేటీఆర్ డిమాండ్ చేశారు. మళ్లీ అలాగే తొత్తులుగా వ్యవహరిస్తామనుకుంటే అధికారులు కాంగ్రెస్ కండువాలు కప్పుకోవాలని, కానీ అధికార పార్టీకి వత్తాసు పలికితే ఊరుకోబోమని వదిలిపెట్టమని హెచ్చరించారు.
మాకు రెడ్ బుక్ ఉండదు, పింక్ బుక్ ఉండదు, ఖాకీ బుక్ ఉంటుందని డీజీపీ మొన్న సినిమా డైలాగ్‌లు చెప్పారు. ఇదేనా నీ ఖాకీ బుక్కు, నీ పోలీసోళ్ల బట్టలు ఊడదీసి కొడుతా అని కాంగ్రెస్ నాయకుడు అంటే కేసు ఉండదు. యూజ్లెస్ ఫెల్లోస్ అన్నా కేసు పెట్టే ధైర్యం లేదు. కానీ మేం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కేసులు పెడుతవా? అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. టైం వస్తుంది. మేం వచ్చాక ఎవరినీ వదిలిపెట్టం.
– కేటీఆర్
క్యాతనపల్లి మున్సిపాలిటీలో మహిళ కౌన్సిలర్లతో అసభ్యంగా ప్రవహించిన కాంగ్రెస్ కౌన్సిలర్లపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎన్నికల సందర్భంగా తీయించిన వీడియోలు బయటపెట్టాలని, తమ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఏం తప్పు చేశారని కేసు పెట్టారంటూ ప్రశ్నించారు. దుర్మార్గంగా ప్రవర్తించిన కాంగ్రెస్ కౌన్సిలర్లను వదిలేసి బాల్క సుమన్, కోవ లక్ష్మిలపై కేసులు పెట్టారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని వారికి బుద్ధి చెప్పే రోజు వస్తుందని స్పష్టంచేశారు.
సీఎం రేవంత్‌రెడ్డికి మున్సిపాలిటీలో దోమల మందు కొట్టే తెలివి లేదని కేటీఆర్ దుయ్యబట్టారు. ఫాగింగ్ చేస్తే దోమలు రావు, అది కూడా చూసుకోలేరా అని చురకలంటించారు. ‘సుమన్‌ను లక్షెట్టిపేట సబ్ జైలులో పెట్టవచ్చు లేదా పెద్దపల్లి, ఆసిఫాబాద్‌లో పెట్టవచ్చు.. కావాలని ఆదిలాబాద్ తీసుకొచ్చి దోమలు ఎక్కువ ఉండే సెల్లో పెట్టారు. కనీసం ఒడోమస్ కూడా ఇవ్వడం లేదు. రాష్ట్రంలో విషజ్వరాలు, జైలులో ఉండేవారికి జ్వరాలు రావాల్నా, అది కూడా చూసుకోలేరా’ అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులను కావాలనే ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తుందే అన్ని గుర్తు పెట్టుకుంటాం. మిత్తితో కలిపి చెల్లిస్తాం’ అని తేల్చిచెప్పారు. న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉన్నదని బాల్క సుమన్ విషయంలో న్యాయం గెలుస్తుందని నమ్ముతున్నామని కేటీఆర్ చెప్పారు.