నర్సింహులపేట, ఫిబ్రవరి 24 : నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన కథనంతో మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో రైతులకు ట్రాన్స్ఫార్మర్ కష్టాలు తొలిగాయి. కొమ్ములవంచలో వ్యవసాయబావులకు విద్యుత్తు సరఫరా మెరుగుపర్చేందుకు 63 కేవీ ట్రాన్స్ఫార్మర్ను మంగళవారం ఏర్పాటు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఆకేరు వాగు ఒడ్డున ఏర్పాటు చేసిన 25 కేవీ ట్రాన్స్ఫార్మర్ ఇటీవల కాలిపోయింది. దీంతో రైతులు, కూలీలు కలిసి పొలాల నుంచి కర్రల సాయంతో ట్రాన్స్ఫార్మర్ను మరమ్మతుల కోసం మోసుకొచ్చారు.
ఈ విషయమై మంగళవారం ‘నమస్తే తెలంగాణ’లో మెయిన్‌లో ‘సర్కార్‌కు పట్టని ట్రాన్స్”ఫార్మర్’ – పొలాల నుంచి మోసుకొచ్చి రిపేరుకు తరలింపు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన విద్యు త్తు అధికారులు.. ఎస్ఈ విజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది 63 కేవీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి విద్యుత్తును పునరుద్ధరించారు. విద్యుత్ కష్టాలపై ‘ నమస్తే తెలంగాణ’లో కథనం రావడం, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుతో రైతులు సంతోషం వ్యక్తంచేశారు.