కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 30 : వారంతా ప్రభుత్వోద్యోగులుగా దశాబ్దాల తరబడి సేవలందించారు. పాలకులు, ప్రజలకు మద్య అనుసంధానకర్తలుగా వ్యవహరించారు. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరి అర్హులకు అందేలా నిర్విరామంగా కృషి చేశారు. విధుల పట్ల అంకితభావంతో వ్యవహరిస్తూ అనేక ఆటుపోట్లను కూడా ఎదుర్కొన్నారు. ఉద్యోగ జీవితంలో ఎన్నో అవార్డులు, రివార్డులు సైతం అందుకున్నారు. ఉద్యోగ విరమణాంతరం ప్రభుత్వం ద్వారా తమకందే ప్రయోజనాలతో కుటుంబావసరాలు తీర్చుకుని, కుటుంబ సభ్యులతో చీకుచింతా లేకుండా గడపాలనే కలలు కన్నారు. అయితే, ఉద్యోగ విరమణ చేసి ఏడాది దాటుతున్నా, వారు కన్న కలలను మాత్రం సాకారం చేసుకోలేకపోతున్నారు.
రిటైర్మెంట్ కాగానే వారి చెందాల్సిన ఆర్ధిక ప్రయోజనాలు అందకపోవటంతో వారు పడుతున్న అవస్థలు ఇంతింతకాదయా!? అన్నట్లు వర్ణణాతీతంగా మారాయి. తాము అధికారంలోకి వస్తే విశ్రాంత ఉద్యోగుల సమస్యలకు చెల్లుచీటి పలుకుతామంటూ,అసెంబ్లీ ఎన్నికలకు ముందు అభయమిచ్చిన కాంగ్రెస్, అధికారం చేపట్టి ఏడాదిన్నర కావస్తున్నా వారి సమస్యలకు మాత్రం ఇప్పటివరకు పరిష్కార మార్గం చూపలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ హాయాంలో పెండింగ్లో ఉన్న డిఏలు కూడా విడుదల చేస్తామంటూ ఆర్భాటంగా హామీలిచ్చినా కేవలం ఒకే ఒక డిఏ విడుదల చేసి మిగతా వాటి పట్ల మొండి ‘చేయి’చూపుతోందని విశ్రాంత ఉద్యోగులు మండిపడుతన్నారు.
ఏడాది కాలంలో జిల్లాలో సుమారు 140 మంది దాకా పదవీ విరమణ పొందగా, వారంతా తమకు చెందాల్సిన ఆర్ధిక ప్రయోజనాలకోసం తాము పని చేసిన కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కలిసిన అధికారినల్లా వేడుకుంటున్నారు. అయినా ప్రయోజనముండటం లేదని, ఫైళ్లు ఆర్ధిక శాఖ వద్ద పెండింగులో ఉంటున్నా యని వాపోతున్నారు. పెరిగిన ధరల కనుగుణంగా కేంద్రం ప్రతి ఆరునెలలకోమారు కరువుభత్యం (డీఏ) పెంచుతుంది. ప్రస్తుతం ఆరు డిఏలకు సంబంధించి బకాయిలు పెండింగ్లో ఉండగా, ఇటీవలే ఒక డీఏ మాత్రం చెల్లించింది. మిగతాయెప్పుడు ఇస్తారో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. పదవీ విరమణ చేసిన అనంతరం పింఛన్, గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్, ఉపయోగించుకొని సంపాదిత సెలవులకు నగదు చెల్లింపు లాంటి సౌకర్యాలు వెంటనే అమలు చేయాల్సి ఉంటుంది.
అయితే, ఏడాది కాలంగా రిటైర్ అయిన వారికి కేవలం పెన్షన్ మాత్రమే విడుదల చేస్తూ, మిగతా ప్రయోజనాలన్నీ పెండింగ్లోనే పెట్టినట్లు విశ్రాంత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తాము ముందుగా రూపొందించుకున్న ప్రణాళిక మేరకు పదవీ విరమణ అనంతరం చేపట్టాల్సిన కార్యక్రమాలన్నీ ఎక్కడికక్కడ పెండింగ్ పడుతుండగా తమ చేతిలో చిల్లిగవ్వ లేక అత్యవసర పరిస్థితుల్లో చేబదులు కూడా లభించక కడు దుర్భర జీవితం అనుభవిస్తున్నట్లు వాపోతున్నారు.
వాస్తవానికి రిటైర్ అయిన అనంతరం వివిధ రూపాల్లో వచ్చే మొత్తం లక్షల్లో ఉంటుంది. దీనితో కొందరు ఇళ్లు నిర్మించుకోవటం, మరికొందరు కూతుళ్ల వివాహాలు చేయటం, ఇంకొందరు గతంలో ఉన్న అప్పులు తీర్చేందుకు మొగ్గు చూపుతుంటారు. అలాగే, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణకు కూడా వచ్చిన మొత్తంలో నుంచే కేటాయిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగ విరమణ అనంతరం తమకు ఎలాగైనా పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందనే ధీమాతో అప్పులు తెచ్చైనా వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి బయటపడుతుండటం సహజం.
అయితే, రిటైరై నెలలకు నెలలు గడుస్తున్నా వారికి చెందాల్సిన ప్రయోజనాలు చెందకపోవటంతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. వారి బాధలు ఎవరికి చెప్పుకోలేక, అవసరానికి డబ్బులు ఎవరినీ అడుగలేక మానసికంగా లోలోన కుంగిపోతున్నారని విశ్రాంత ఉద్యోగుల సంఘం నేత పెండ్యాల కేశవరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఆరోగ్య పరిరక్షణ కోసం హెల్త్ కార్డులపై రూ. 5 లక్షల ఉచిత వైద్య సదుపాయమైనా కల్పించినా, కొంతలో కొంత ఇబ్బందులు అధిగమించేవారనే అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు చొరవ చూపాలని ఆయన కోరారు.