కరీంనగర్ కలెక్టరేట్, ఆగస్టు 7 : శిక్షణ పొందిన సర్వేయర్ల పరీక్షల ఫలితాలు వెలువడక ముందే అప్రెంటిస్ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఆందోళన వ్యక్తమవుతున్నది. తమను విధుల్లోకి తీసుకుంటారా.. రిజెక్ట్ చేస్తారా..? అనే భయం వెంటాడుతున్న ది. భూముల సర్వేలో జాప్యానికి కారణం సర్వేయర్ల కొరతేనని, ఔత్సాహిక పట్టభద్రులకు శిక్షణ ఇచ్చి సర్వేయర్‌గా లైసెన్సు లు జారీ చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటన చేయడంతో వందలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో అర్హులను ఎంపిక చేసి కరీంనగర్‌లోని జి ల్లా పరిషత్ సమావేశమందిరంలో శిక్షణ ఇచ్చారు. గత నెల 26, 27వ తేదీల్లో వీరి ప్రతిభను పరిశీలించేందుకు పరీక్షలు నిర్వహించారు.
ఫలితాలు వెలువడాల్సి ఉన్నది. అయితే, సాంకేతిక పరమైన సమస్యలతో కొంత ఆలస్యమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తుండగా, ఈలోగా శిక్షణ పొందిన వారందరికీ 40 రోజులపాటు అప్రెంటిస్ అవకాశం కల్పిస్తూ, ఒక్కో మండల సర్వేయర్‌కు పది నుంచి 15 మందిని అటాచ్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. మొత్తం 232 మంది శిక్షణ పొందిన అభ్యర్థులు ప రీక్షలు రాయగా, వారందరినీ మండలా ల్లో విధులు నిర్వహిస్తున్న సర్వేయర్లకు అప్పగించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈనెల 4 నుంచి సంబంధిత సర్వేయర్లతో కలిసి విధుల్లోకి వెళ్తున్నారు.
వాస్తవానికి ఫలితాలు వెలువడిన తర్వాతే ఉత్తీర్ణులైన వారికి అప్రెంటిస్‌షిప్ అవకాశం కల్పించి, అనంతరం లైసెన్సు మంజూరు చేసి భూకొలతల బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుందని ఆ శాఖలోని కిందిస్థాయి అధికారులు పేర్కొంటున్నారు. అయితే, ఫలితాలు వెలువడ్డ తర్వాత ఉత్తీర్ణత సాధించకపోతే తమకు విధులు అప్పగిస్తారా.. లేక అనుత్తీర్ణులంటూ తిరస్కరిస్తారా..? అనే సందేహంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని వారికి కూడా విధులు అప్పగి స్తే, భూ కొలతలపై యజమానుల్లో అనుమానాలు మొదలవుతాయనే అభిప్రాయాలు లైసెన్సుడ్ సర్వేయర్లు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సర్వేల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రభాకర్‌ను సంప్రదించగా, ప్రభుత్వాదేశాల మేరకే తాము సర్వేయర్లకు శిక్షణ పొందిన అభ్యర్థులను అటాచ్ చేశామని వెల్లడించారు. ఉన్నతాధికారులు విడుదల చేసే ఆదేశాలకనుగుణంగా తా ము నడుచుకుంటామని స్పష్టం చేశారు.