Medical camp | కోల్ సిటీ, జూలై 23: గోదావరిఖని వినోభా నగర్ లో కరీంనగర్ మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన ఉచిత గుండె వ్యాధి నిర్ధారణ శిబిరానికి విశేష స్పందన లభించింది. ఆ డివిజన్లోని సింగరేణి ఉద్యోగులు, రిటైర్డు కార్మికులు దాదాపు 120 మంది హాజరై గుండె వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆస్పత్రి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ నాగరాజు, డీఎంఓ డాక్టర్ హర్షిత్ హాజరై ఉచితంగా 2డీ, ఈసీజీ వైద్య పరీక్షలు చేసి రోగ నిర్ధారణ చేశారు.
ఈ సందర్భంగా ఆస్పత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ సుధీర్ఘకాలం సింగరేణిలో పని చేసి ఉద్యోగ విరమణ పొందిన అనేక మంది రిటైర్లు కార్మికులకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. వివిధ భారీ పరిశ్రమలకు నిలయమైన రామగుండం నగరం ఎంతో కాలుష్యంతో కూడుకున్నదనీ, ఇక్కడ గుండెజబ్బులు వయసుతో నిమిత్తం లేకుండా వస్తున్నాయనీ, ప్రతీ ఒక్కరూ గుండె పరీక్షలు చేసుకోవాలంటే ఖర్చుతో కూడుకున్నదనీ, అలాంటి వారు ఈ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కు చెందిన రాజు, మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, బొంగోని హరీష్, రమేష్ తోపాటు అధిక సంఖ్యలో డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.