Jagtial | జగిత్యాల : జగిత్యాల జిల్లాలోని మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికల రిజర్వేషన్లను కలెక్టర్ బీ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం ప్రకటించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్లను కౌన్సిలర్ పదవులకు రిజర్వేషన్లు ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ కేటగిరీల వారిగా ఖరారు చేశారు. తదనంతరం మహిళలకు కేటాయించిన రిజర్వేషన్లను డ్రా పద్దతి ద్వారా ఖరారు చేశారు.
ఈ కార్యక్రమానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ బీ సత్యప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా మున్సిపాలిటీల రిజర్వేషన్ లు ఖరారు చేశామని, మహిళా రిజర్వేషన్ లు డ్రా పద్ధతి ద్వారా ఖరారు చేశామని తెలిపారు.
ఈ రిజర్వేషన్ ల కార్యక్రమం పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం సజావుగా సాగేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు, ప్రజలు సహకరించాలని కోరారు. రిజర్వేషన్ ల వివరాలను అధికారికంగా నమోదు చేసి, ప్రజలకు అందుబాటులో ఉంచనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బీ రాజా గౌడ్, మున్సిపల్ కమిషనర్లు, ప్రత్యేకాధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.