Dharmaram | ధర్మారం, జనవరి 26: ధర్మారం మండల కేంద్రంలో స్థానిక జీపీ కార్యాలయం వద్ద సర్పంచ్ దాగేటి రాజేశ్వరీ, రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ డీ శ్రీనివాస్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో వేముల సుమలత, వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఏఎంసీ చైర్మన్ లావుడియా రూప్లా నాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఎంఆర్సీ కార్యాలయం వద్ద ఎంఈఓ పోతు ప్రభాకర్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ అనంత రామకృష్ణ, జెడ్పీ ఉన్నత పాఠశాలలో హెడ్మాస్టర్ షీలా రెడ్డి, మోడల్ పాఠశాలలో ప్రిన్సిపల్ రాజ్ కుమార్, ఎస్టీ మినీ గురుకుల విద్యాలయంలో ప్రిన్సిపల్ శ్రీలత, ట్రాన్స్కో సహాయ డివిజన్ కార్యాలయంలో ఏడిఈ విజయ్ గోపాల్ సింగ్, కస్తూర్బా గాంధీ పాఠశాలలో ప్రత్యేక అధికారి శోభ , ప్రాథమిక పాఠశాలలో హెడ్మాస్టర్ మల్లారెడ్డి జాతీయ జెండాలను ఎగరవేశారు.
అదేవిధంగా మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ జెండా గద్దెపై పార్టీ పట్టణ అధ్యక్షుడు తుమ్మల రాంబాబు జాతీయ జెండాను ఎగురవేశారు. ఇంకా కాంగ్రెస్, బీజేపీ నాయకులు పార్టీ జెండా గద్దెలపై జాతీయ జెండాలను ఎగురవేశారు. వివిధ కుల సంఘాల కార్యాలయాలు, లయన్స్ క్లబ్, వర్తక వ్యాపార సంఘం ,మండల పరిషత్ ఎదుట ఉన్న క్రీడాస్థలంలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా మండల వ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో తొలిసారిగా సర్పంచులు జాతీయ జెండాలను ఎగురవేశారు.
పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనభరిచిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు
ధర్మారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనభరిచిన విద్యార్థులకు దాగేటి ప్రవీణ్ యాదవ్ ఫౌండేషన్ తరఫున వ్యవస్థాపకుడు దాగేటి ఉదయ్ యాదవ్ నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో ఎస్ఏ-1 పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఉపాధ్యాయులు ఎంపిక చేశారు.
దీంతో ఒక్కో తరగతి నుంచి ముగ్గురు విద్యార్థుల చొప్పున ఎంపిక చేశారు. దీంతో ఉత్తమ ప్రతిభను కనభరిచిన ప్రథమ ర్యాంకు విద్యార్థికి రూ.3 వేలు, ద్వితీయ ర్యాంకు విద్యార్థికి రూ.2 వేలు, తృతీయ ర్యాంకు విద్యార్థికి రూ.వెయ్య చొప్పున నగదు ప్రోత్సాకాన్ని సదరు విద్యార్థులకు స్థానిక సర్పంచ్ దాగేటి రాజేశ్వరి, ఫౌండేషన్ ఫౌండర్ దాగేటి ఉదయ్ యాదవ్ చేతుల మీదుగా అందజేసి వారిని అభినందించారు.
ఈ సందర్భంగా పాఠశాల తరఫున గ్రామ సర్పంచి రాజేశ్వరి, ఉపసర్పంచ్ ఎలిగేటి మల్లేశం, పలువురు వార్డు సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ షీలా రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.