Thimmapur | తిమ్మాపూర్, జూన్ 23 : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని హనుమాన్ నగర్ లో శ్రీ శంకు చక్ర ఆది పెరుమాండ్ల భక్తాంజనేయ స్వామి ఆలయ పున ప్రతిష్టాపన వేడుకలు ఘనంగా ప్రారంభమైంది. ఆంజనేయ ఆలయ పున నిర్మాణంతోపాటుతో పాటు శిఖర ప్రతిష్టా మహోత్సవం, గణపతి,నాగదేవత, నవ గ్రహ విగ్రహాల ప్రతిష్టా మహోత్సవాన్ని యక్షాచార్యులు శ్రీమాన్ వానమామలై పవన్ కుమారాచార్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ అన్నీ ఏర్పాటు చేసింది. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే ఆలయంగా పేరున్న ఆంజనేయస్వామి ఆలయ పున నిర్మాణంలో ఆలయ కమిటీ సభ్యులతోపాటు గ్రామస్తులు, చుట్టు పక్కన గ్రామాల భక్తులు, కరీంనగర్ భక్తులు భాగస్వాములై ఆలయాన్ని సుందరంగా నిర్మించారు. ప్రారంభోత్సవంలో భాగంగా ఈరోజు ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
యాగశాల ప్రవేశం, మూలమంత్ర హోమం, స్థాపితా దేవతా హోమం, నిత్య పూర్ణాహుతి, జలాధివాసము, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. గ్రామం నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బుధవారం ధాన్యాధివాసం, మంగళా శాసనం, ఫల పుష్ప శయ్యాధివాసము కార్యక్రమాలు, గురువారం ఉదయం గణపతి, నాగదేవత, నవగ్రహ విగ్రహ, యంత్ర ప్రతిష్ట, ధ్వజస్తంభ, శిఖర ప్రతిష్ట కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నారు.
ఆలయ ప్రధాన అర్చకులు తిరునగిరి వెంకటాద్రి స్వామి, తిరునగిరి చక్రధరస్వామి తోపాటు సహాయ అర్చకులు లక్ష్మీవర్ధన్, హర్షవర్ధన్, విష్ణువర్థన్ ల మంత్రోచ్ఛారణాల మధ్య పూజా కార్యక్రమాలతో పాటు ప్రతిష్టా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, ఆలయ కమిటీ పాలకవర్గ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గంకిడి లక్ష్మారెడ్డి, కేడీసీసీబీ మాజీ చైర్మన్ కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.