ఉచిత బియ్యాన్ని క్షేత్రస్థాయిలో పంపిణీ చేసే రేషన్ డీలర్లకు ఐదు నెలలుగా కమీషన్ రావడం లేదు. అప్పులు చేసి అద్దెలు చెల్లిస్తూ, దుకాణాలు నిర్వహిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అధికారులు, ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరిగీ తిరిగీ వేసారి డీలర్లు ఇక ప్రత్యక్ష పోరుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్టు గౌరవ వేతనంతోపాటు కమీషన్ పెంపు ఏమైందని ప్రశ్నిస్తున్నారు. నేటి నుంచి సేవలు పూర్తిగా నిలిపి వేస్తామని ఒక డీలర్ల సంఘం ఇప్పటికే ప్రకటించగా, మరో సంఘం మాత్రం ఈ నెల 5న ఒక్క రోజే సేవలు నిలిపి వేసేందుకు సిద్ధమవుతున్నది. సేవలు నిలిపి వేస్తే పేదలకు బియ్యం అందేది ఎలాగనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
కరీంనగర్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : పేదలకు ఉచిత బియ్యం పంపిణీలో కీలకంగా వ్యవహరిస్తున్న రేషన్ డీలర్లకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్ పెంచింది. క్వింటాలుకు కేవలం 70 మాత్రమే ఉన్న కమీషన్‌ను 140 చేసింది. గతంలో ఈ కమీషన్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకేసారి డీలర్ల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేవి. కానీ, ఐదు నెలలుగా కమీషన్ ఇవ్వడం లేదు. ఏప్రిల్, మే నెలలకు సంబంధించి రాష్ట్రం ఇచ్చినా, కేంద్రం మాత్రం ఇవ్వలేదు. జూన్, జూలై, ఆగస్టుకు సంబంధించి అటు కేంద్రం గానీ, ఇటు రాష్ట్రం గానీ మొత్తానికే ఇవ్వలేదు. పైగా కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేదు. రేషన్ డీలర్ల కమీషన్ 140 నుంచి 300కు పెంచుతామని, నెలకు 5 వేల గౌరవ వేతనం ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించినా ఇప్పటికి దానిపై అతీగతీ లేదు. దీంతో రేషన్ డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ హామీల సంగతి అటుంచితే అసలుకే ఎసరు తెచ్చేలా ఇచ్చే కమీషన్ కూడా సరిగ్గా ఇవ్వకపోవడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఇప్పుడు ఇస్తున్న కమీషన్‌ను బట్టి వంద క్వింటాళ్ల బియ్యం అమ్మితే వచ్చేది కేవలం 14 వేలేనని, అందులో 500 టీడీఎస్ కట్ అవుతున్నాయని, దుకాణం అద్దె, ఈ-పాస్ మిషన్ల నిర్వహణ, తూకం వేసే వ్యక్తి వేతనం, హమాలీ ఖర్చులు చెల్లిస్తే తమకు మిగిలేది నామ మాత్రమేనని చెబుతున్నారు. దీనికి తోడు ఐదు నెలలుగా కమీషన్ రాకపోవడంతో అద్దెలు చెల్లించ లేక పోతున్నామని, ఇంటి ఓనర్లు తమపై ఒత్తిడి తెస్తుంటే అప్పులు చేసి చెల్లిస్తున్నామని డీలర్లు వాపోతున్నారు. కమీషన్ ఎప్పటికపుడు ఇవ్వకుంటే సేవలు అందించేందుకు డీలర్లు సిద్ధంగా లేరని చెబుతున్నారు.
జూన్‌లో మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసిన రేషన్ డీలర్లు, వచ్చే నెలలో తిరిగి పంపిణీ చేయాల్సి ఉన్నది. అయితే, కమీషన్ ఇవ్వకపోవడంతో రేషన్ డీలర్ల సంక్షేమ సంఘాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. నేటి నుంచి సేవలు నిలిపి వేస్తామని ఇప్పటికే ఒక డీలర్ల సంఘం ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. మరో సంఘం మాత్రం ఈ నెల 5న ఒక రోజు సేవలు నిలిపి వేస్తామని ప్రకటించింది. కమీషన్ కోసం బిల్లులు చేసి ఆయా ఎస్టీవోలకు పంపించామని అధికారులు చెబుతున్నారు. డీలర్లు కూడా 15 రోజుల కిందనే టోకెన్లు తీసుకున్నారు. కానీ, ఇప్పటి వరకు కమీషన్ వారి ఖాతాల్లో జమకాకపోవడంతో రేషన్ డీలర్లు ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ని కలిసి తమ కమీషన్ ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఆయన.. కేంద్రం కమీషన్ చెల్లించిందని, రాష్ట్రం విడుదల చేయడం లేదని చెప్పినట్టు తెలుస్తున్నది. నిజానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకకాలంలో కమీషన్ ఇస్తేనే డీలర్ల అవసరాలకు ఉపయోగపడతాయి. అలాకాకుండా ఒక విధానం లేకుండా తమకెప్పుడు వీలైతే అప్పుడు కమీషన్ ఇస్తున్నాయి. దీంతో డీలర్లు ఇబ్బందులు పడుతుండగా, డీలర్ల సంఘాలు ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్నాయి.
రేషన్ షాపులను మినీ సూపర్ మార్కెట్లుగా గుర్తించాలి. మరిన్ని నిత్యావసర సరుకులను పేదలకు అందుబాటులోకి తేవాలి.
డీలర్లకు హెల్త్ కార్డులు జారీ చేయాలి.
బియ్యం దిగుమతి చార్జీలు ప్రభుత్వమే భరించాలి.
రేషన్ డీలర్ చనిపోతే దహన సంస్కారాలకు రూ.30 వేలు చెల్లించాలి.
పదేళ్లుగా పేరుకుపోయిన పాత బకాయిలను చెల్లించాలి.
గోదాముల నుంచి భారీ ఆన్లైన్ వేయింగ్ కాంటాల (లారీని తూకం వేసే విధంగా) ద్వారా రేషన్ షాపులకు సరుకులు పంపిణీ జరిగేలా గోదాం ప్రాంగణంలో శాశ్వత ప్రాతిపదికన వే బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలి.
పోర్టబిలిటీ సిస్టం వచ్చినందున రేషన్ కార్డుల బైఫర్గేషన్ విధానాన్ని నిలిపివేసి, కొత్త షాపుల ఏర్పాటు రద్దు చేయాలి. అత్యవసరమైతే గ్రామీణ ప్రాంతాల్లో 800 కార్డులు, పట్టణ ప్రాంతాల్లో 1,200 కార్డులకు పైబడి ఉన్న రేషన్ షాపులను మాత్రమే బైఫర్గేషన్ చేయాలి.
కరోనాతో మరణించిన డీలర్ల కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలి.
సంవత్సారానికోసారి చేపట్టే మా అథరైజేషన్ రెన్యూవల్‌ను ఎలాంటి రెన్యూవల్ లేకుండా శాశ్వత ప్రాతిపదికన కొనసాగించాలి.
గోదాముల నుంచి రేషన్ దుకాణాలకు చేర్చే సరికి బియ్యం తరుగు వచ్చి డీలర్లు నష్టపోతున్నందున తరుగుదల కింద 2 శాతం బియ్యం కోటాను అదనంగా అందించాలి.
రేషన్ దుకాణాల అద్దెను ప్రభుత్వమే భరించాలి.
ఏ నెల కమీషన్ ఆ నెలలోనే అందించాలి.
హైదరాబాద్‌లో రేషన్ భవన్ నిర్మాణానికి వెయ్యి చదరపు అడుగుల స్థలం కేటాయించాలి.
రేషన్ డీలర్లలో ఉన్నత విద్యావంతులైన వారికి శాఖాపరమైన పదోన్నతులను కల్పించి వారి సేవలను వినియోగించుకోవాలి.
మా న్యాయమైన డిమాండ్లు నెరవేర్చకుంటే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతాం. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. రూ.5 వేల గౌరవ వేతనం, క్వింటాలుకు రూ.300 కమీషన్ ఇస్తామని మేం అడగక ముందే ఆ పార్టీ హామీ ఇచ్చింది. రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. పైగా ఐదు నెలలుగా మాకు రావాల్సిన కమీషన్ కూడా ఇవ్వడం లేదు. మరి మేం ఎట్లా బతికేది? మా సంసారాలు ఎట్లా గడిచేది? ఇప్పటికైనా మా కమీషన్ విడుదల చేయకుంటే ప్రత్యక్ష పోరాటానికి సిద్ధంగా ఉన్నాం.
ఐదు నెలలుగా కమీషన్ రాకపోవడంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాకు ఇలాంటి పరిస్థితి ఎన్నడూ రాలేదు. వెంటనే కమీషన్ విడుదల చేయాలి. లేదంటే ఆందోళన చేయక తప్పదు. దుకాణాల అద్దెలు చెల్లించకపోతే వాటి యజమానులు ఒత్తిడి తెస్తున్నరు. అప్పో సప్పో చేసి చెల్లిస్తున్నాం. గ్రామీణ డీలర్ల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. వారి కుటుంబాలు కూడా గడవని పరిస్థితి ఉన్నది.
రేషన్ డీలర్లు దుమ్మూ ధూళిలో పనిచేస్తూ అనారోగ్యం పాలవుతున్నరు. కనీసం దవాఖానాకు వెళ్లి వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు. ఆరోగ్యం చెడిపోతున్నా సేవలు అందిస్తున్నం. మా గోడు వినేవారైతే లేరు. మాకు కనీసం హెల్త్ కార్డులు కూడా ఇవ్వడం లేదు. ఇటు కమీషన్ ఇవ్వకుండా మరీ ఇబ్బందులకు గురి చేస్తున్నరు. ఇప్పటికైనా కమీషన్ విడుదల చేయాలి. లేదంటే ఆందోళన చేయకతప్పదు.