మానకొండూర్, మే 21: ప్రజలు కేసీఆర్ పాలనను గుర్తు చేసుకోవడం చూసి కాంగ్రెస్ ప్రభుత్వం ఓర్వలేక పోతున్నదని, రాజకీయ కక్షతోనే నోటీసులు ఇచ్చిందని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, పరిపాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు రేవంత్‌రెడ్డి కాళేశ్వరం కమిషన్ నోటీసుల కుట్రకు తెరలేపాడని దుయ్యబట్టారు. గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్‌లోని ధవళేశ్వరం ప్రాజెక్టుకు తరలించడానికి కుట్ర జరుగుతున్నదని, అందుకే పథకం ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ప్రభుత్వం దాడిచేస్తున్నదని విమర్శించారు.
మానకొండూర్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రసమయి మాట్లాడారు. కేసీఆర్‌ను రేవంత్ సర్కార్ ఎందుకు వేధిస్తున్నదో చెప్పాలని ప్రశ్నించారు. ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించినందుకా..? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కోటి ఎకరాలకు సాగునీరిచ్చినందుకా..? రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్‌తో రైతును రాజును చేసినందుకా..? మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీళ్లు ఇచ్చినందుకా..? అని నిలదీశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో మానకొండూర్ నియోజకవర్గంలో మూడు పంటలు పండించారని గుర్తు చేశారు. చంద్రబాబు మెప్పు కోసం రేవంత్‌రెడ్డి తెలంగాణకు ద్రోహం చేస్తున్నాడని మండిపడ్డారు. నీటితో కళకళలాడాల్సిన కాళేశ్వరాన్ని ఎండబెట్టి ఇసుకను తోడేస్తున్నారని ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోళ్లు ఇప్పటి వరకు 40 శాతం కూడా జరగలేదని, కేంద్రాల్లో వడ్ల కుప్పలు వానకు తడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులకు రైతుల కష్టాలు పట్టించుకోవడానికి క్షణం తీరిక లేదని, కానీ హైదరాబాద్‌లో జరుగుతున్న అందాల భామల పోటీలపై మక్కువ చూపుతున్నారని చురకలంటించారు.
మానకొండూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి ప్రత్యేక చొరవ తీసుకుని రెండు, మూడు రోజుల్లో వడ్ల కొనుగోళ్లు పూర్తిచేయాలని, లేని పక్షంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్‌గౌడ్, శంకరపట్నం జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, నాయకులు ఎరుకల శ్రీనివాస్‌గౌడ్, వీరాస్వామి, శాతరాజు యాదగిరి, బోడ రాజశేఖర్, రాజుయాదవ్, నెల్లి శంకర్, సందీప్, అనిల్ పాల్గొన్నారు.
జగిత్యాల, మే 21 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి పాలన అందించారని, రాష్ర్టాన్ని సుభిక్షంగా మార్చారని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కొనియాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణను సస్యశ్యామలం చేశారని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చిందని మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో ఎండకాలంలోనూ నీళ్లిచ్చిన ఘనత కేసీఆర్‌దేనని ప్రశంసించారు. పంటలకు నీళ్లందించక ఎండబెట్టి రైతులను గోసబెట్టిన ఘనత కాంగ్రెస్‌దేనని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చేస్తున్న పనులలతో ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను పోగొట్టుకోవడానికి, అలాగే కేసీఆర్, బీఆర్ఎస్కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. గడిచిన పదిహేను నెలల కాలంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని నోటీసులు ఇచ్చిన న్యాయపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.
కథలాపూర్, మే 21 : సర్కారు చేతగాని తనం, పాలనా వైఫల్యాలన్ని కప్పిపుచ్చుకునేందుకు నోటీసుల పేరిట డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం కమిషన్ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్‌పై కుట్రలకు తెరలేపిందని, ఇలాంటి చర్యలకు పాల్పడడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. వ్యవసాయాన్ని పండుగ చేసిన నేత కేసీఆర్ అని కొనియాడారు. కాంగ్రెస్ కుట్రలను తెలంగాణ సమాజం నమ్మదని స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విచారణ పేరిట నోటీసులు ఇవ్వడం సిగ్గు చేటని, ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలా కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. అయినా ఇదంతా కక్షసాధింపు చర్యల్లో భాగమేనని చెప్పారు. తెలంగాణ ప్రజలు మరోసారి మర్లబడడం ఖాయమన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణను అన్ని రంగాల్లో ముందుంచారని, రాష్ట్ర కీర్తిని విశ్వవాప్తం చేశారని ప్రశంసించారు. ప్రజలు కేసీఆర్‌తో ఉంటారని, ఆయనను అడ్డుకోవాలన్న ప్రతి ప్రయత్నాన్ని చివరికి ప్రజలే తిప్పికొడతారని హెచ్చరించారు.