Ambedkar statues | కోల్ సిటీ, డిసెంబర్ 6 : గోదావరిఖనిలోని మున్సిపల్ ఆఫీసు ముందున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహంతోపాటు ఎన్టీపీసీ, రామగుండం, అంతర్గాంలో గల అంబేద్కర్ విగ్రహాలు, గోదావరిఖనిలోని జ్యోతిరావు పూలే, జగ్జీవన్‌రామ్ విగ్రహాలను కూల్చివేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని, దళితుల మనోభావాలను దెబ్బతీసేలా ఈ విగ్రహాలను దయచేసి కూల్చివేయొద్దని ఆలిండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు స్థానిక ఎమ్మెల్యేకు విన్నవించారు. ఈ మేరకు అంబేద్కర్ వర్ధంతి పురస్కరించుకొని శనివారం రామగుండం మున్సిపల్ ఆఫీసు ముందు గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మీరు నియోజక వర్గంలోని అంబేద్కర్ విగ్రహాలను తొలగించేందకు కుట్ర పూరితంగా వ్యవహరించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ఇదివరకే కూరగాయల మార్కెట్ ఎదురుగా గల అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేయించిన స్థానిక ఎమ్మెల్యే ఆ విగ్రహాన్ని ఇప్పటికి కూడా ఎక్కడ కూడా ఏర్పాటు చేయించలేదన్నారు. కొద్ది నెలలుగా నియోజక వర్గంలో గల అంబేద్కర్ విగ్రహాలను తొలగించేందుకు అంతర్గతంగా మెనిఫెస్టోను తయారు చేసుకొని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
కొంతమంది దళిత సంఘాల్లో పని చేస్తున్న స్వార్థపరులు ఇస్తున్న తప్పుడు సమాచారంతో అంబేద్కర్ సంఘం నాయకులపై అపార్థం చేసుకోవడం సరికాదని పేర్కొన్నారు. దళిత, అణగారిన వర్గాల జాతికి మేలు చేయని నాయకుల మాటలను విని తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. అంబేద్కర్ సంఘం మీ నుంచి ఇప్పటివరకు ఏలాంటి లబ్ధి పొందలేదని గుర్తు చేశారు. విగ్రహాల కూల్చివేత ముందు దళిత సంఘాలతో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవాలన్నారు.
సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేశ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పులి మోహన్, గొర్రె రమేశ్, బూడిద మహేందర్, పంజా అశోక్, నర్సింగరావు, ఆకునూరి బాల అంకుస్, దుబాసి బొందయ్య, శశిభూషణ్, పెగడపల్లి నారాయణ, బొచ్చు శంకర్, పానుగంటి రాజలింగం, రంగయ్య, మహేందర్, శనిగరం చంద్రశేఖర్, దొమ్మటి శేఖర్, కరీం, కాసిపాక రాజమౌళి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.