Ramagundam | కోల్ సిటీ, ఏప్రిల్ 27: భగ.. భగ.. ‘మండె’ ఎండలతో రామగుండం అగ్నిగుండంగా మారింది. అడుగు బయటపెడితే అగ్గి దగడు బెంబేలెత్తిస్తున్నది. ఎండ తీవ్రతకు గోదావరిఖనిలోని ప్రధాన రోడ్లపై మధ్యాహ్నం వేళ ఒక్క పురుగు కనిపించకపోవడంతో దారులన్నీ బోసిపోతున్నాయి. గడిచిన మూడు రోజులుగా రామగుండంలో గరిష్టంగా నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలకు పెరిగినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
కాగా ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతుండడంతో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఆందోళన కలిగిస్తోంది. సాయంకాలం వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఉదయం ఏడు గంటలకే భానుడు నిప్పులు గక్కుతుండడం ఆరంభమవుతుంది. రాత్రి 8 గంటల వరకు కూడా ఎండ దగడు తగ్గడం లేదు. వివిధ భారీ పరిశ్రమలకు నిలయంగా ఉన్న రామగుండంలో ప్రతి వేసవి కాలంలో రాష్ట్రంలోనే రికార్డ్ స్థాయిలో ఎండలు ఉండడం సహజం.