Godavarikhani | కోల్ సిటీ, మే 21 : రోహిణీ కార్తె ముందు రోళ్లు పగిలే ఎండలు కొట్టడం ప్రకృతి సహజ వైపరీత్యం. కానీ, ఈసారి కార్తెకు వారం రోజుల ముందు నుంచే ఎండలు ఉగ్రరూపం దాల్చడంతో రామగుండం పారిశ్రామిక ప్రాంతం అగ్నిగుండంగా తయారైంది. ఈ నేపథ్యంలో గురువారం రామగుండంలో ఎండ తీవ్రత ప్రమాద స్థాయిలో ఉందని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ హెచ్చరిక జారీ చేసింది. ఈమేరకు పారిశ్రామిక ప్రాంతంలోని పలువురి మొబైల్ ఫోన్లకు సందేశాలు పంపించడంతో హడలెత్తిపోయారు.
మధ్యాహ్నం 12 గం.ల నుంచి 4 గం.ల వరకు ఎట్టి పరిస్థితిలోనూ బయటకు రావొద్దని హెచ్చరించింది. వీలైనంత వరకు ఇంటిలోనే ఉంటూ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు తాగాలని సూచిక జారీ చేసింది. ఐతే గత నాలుగు రోజులుగా రామగుండంలో ఊహించని స్థాయిలో ఎండలు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతల భయానికి జనాలు ఇళ్ల నుంచి బయటకు అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. చుట్టూ వివిధ భారీ పరిశ్రమలు ఉండటంతో మిగతా ప్రాంతాల కంటే గోదావరిఖనిలో ఎండ దగడు ప్రమాద స్థాయిలో ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈనెల 25 నుంచి రోహిణీ కార్తె ఆరంభం కావడంతో అప్పటి పరిస్థితి తలచుకొని భయపడుతున్నారు.