సిరిసిల్ల రూరల్, మే 27: నేత కార్మికులు మనోధైర్యం కోల్పోవద్దని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని చేనేత జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జి.రాఘవరావు పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైద్యశాలలోని మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్, చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చంద్రంపేటలో గల పద్మశాలి సంఘ భవనంలో మంగళ వారం ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నం చందర్ కార్మిక కుటుంబాలకు కౌన్సిలింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చేనేత, జౌళి శాఖ రాజన్న సిరిసిల్ల జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ జి. రాఘవరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధిలోకి రావాలని సూచించారు.
ప్రభుత్వం కార్మికులు, వస్త్ర పరిశ్రమ కోసం మహిళాశక్తి చీరలను ప్రత్యేక పథకంగా ఏర్పాటు చేసిందని అన్నారు. చేతి నిండా పని కల్పించే ఉద్దేశ్యంతో వెల్ఫేర్ డిపార్ట్మెంట్, సర్వశిక్ష అభియాన్ స్కూల్ యూనిఫామ్స్, మరి కొన్ని ప్రైవేట్ ఆర్డర్లను కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. నిరంతరం పని కల్పించేందుకు కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వం వస్త్ర పరిశ్రమకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని వివరిస్తూ యార్న్ సబ్సిడీ, త్రిఫ్ట్ పథకం, నేతన్న బీమా లాంటి పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడవద్దని , ప్రభుత్వం కార్మికులకు అండగా ఉంటున్నదని స్పష్టం చేశారు.
ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నం చందర్ మాట్లాడుతూ.. ఆత్మహత్య సమస్యకు పరిష్కారం చూపదని, మరింత సమస్య పెరుగుతుందని అన్నారు. ఆత్మహత్య ఆలోచనలు, మానసిక సమస్యలు ఎదురైనప్పుడు మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ ను సంప్రదించాలని కోరారు. నిద్ర సమస్యలు, మద్యపాన వ్యసనం, తంబాకు మొదలగు అలవాట్లను గురించి కార్మికులకు వివరించి, మానుకోవాలని సూచించారు. కమ్యూనిటీ ఫెసిలిటేటర్ వేముల మార్కండేయ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కమ్యూనిటీ ఫెసిలిటేటర్ లను ఏర్పాటు చేసిందని అన్నారు. ఎటువంటి సమస్యలు ఎదురైనా పరిష్కరించడానికి తాము ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని తెలిపారు.