సిరిసిల్ల రూరల్, మే 6: తంగళ్లపల్లి మండలం నేరేళ్లలోని చారిత్రక ఆలయం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి (Venugopala Swamy) బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మంళవారం నుంచి ఈ నెల 13 వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. వైశాఖ శుద్ధ నవమి మంగళవారం సాయంత్రం ద్రావిడ వేదాధ్యయనం తొళక్కము ప్రారంభమయ్యాయి.7న వైశాఖ శుద్ధ దశమి బుధవారము ఉదయం ద్రావిడ వేదాధ్యయనం సేవా కాలం తీర్థ గోష్టి నిర్వహిస్తారు. సాయంకాలం ద్రావిడ వేదాధ్యయనము సేవాకాలము తీర్థ గోష్టి ప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. 8న ఏకాదశి గురువారము ఉదయం ప్రబంధ సేవా కాలం తీర్థగోష్టి ప్రసాద వితరణతోపాటు సాయంకాలం వేళలో పరమపదోత్సవం, ఉత్సవ అంకురార్పణ నిర్వహిస్తారు.
9న ద్వాదశి శుక్రవారం ఉదయం ధ్వజారోహణం భేరీ పూజ, సాయంకాలం స్వామివారి కళ్యాణోత్సవం, అగ్ని ప్రతిష్ట బలిహరణము చేయనున్నారు. 10న త్రయోదశి శనివారం ఉదయం గ్రామ సేవ హోమము బలిహరణ తీర్థ గోష్టి, సాయంకాలం హోమము బలిహరణ తీర్థ గోష్టి తర్వాత స్వామి వారు పొన్న వాహనంపై విహరిస్తారని ఆలయ అధికారులు తెలిపారు.11న చతుర్దశి ఆదివారం ఉదయం హోమము బలిహరణము గ్రామ సేవ తీర్థ గోష్టి, సాయంత్రం బలిహరణ హోమము తీర్థ గోష్టి తరువాత స్వామి వారు గజవాహనంపై విహారం చేస్తారు. 12న పౌర్ణమి సోమవారం ఉదయం హోమము బలిహరణ గ్రామ సేవ తీర్థ గోష్టి, సాయంత్రం 7 గంటల నుంచి తీర్థగోష్టి ప్రసాద వితరణ 12 గంటల వరకు జరుపుతారు. తరువాత రథ ప్రతిష్ట కార్యక్రమములు ప్రారంభమవుతాయన్నారు. తెల్లవారుజామున 3 గంటలకు శ్రీ స్వామి వారు రథంపై అధిరోహిస్తారని పేర్కొన్నారు.13న వైశాఖ బహుళ పాడ్యమి మంగళవారం చక్రస్నానం, పుష్పయాగం పూర్ణాహుతి, గ్రామ బలి, ఏకాంత సేవ తీర్థ గోష్టి, ప్రసాద వితరణ, ఆశీర్వచనం, అర్చక స్వాముల సన్మానం నిర్వహిస్తారు.
వెంకన్న బ్రహ్మోత్సవాలు భారీగా భక్తులు
వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలకు పరిసర గ్రామాల ప్రజలు, భక్తులు పెద్దసంఖ్యలో హాజరవుతారు. ఆలయంలో సుమారు 200 ఏళ్ల చరిత్ర గల అఖండ దీపం ఉన్నది. నిత్యం దీపం వెలుగుతూనే ఉంటుంది. బ్రహ్మోత్సవాల్లో స్వామివారి దర్శనం, కల్యాణోత్సవం, రథోత్సవం వైభవంగా ప్రతి ఏటా నిర్వహించడం ఆనవాయితీ. బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.