సిరిసిల్ల : శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ కళాశాలల సెమిస్టర్ లను బహిష్కరిస్తామని జిల్లా ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్ రావు తెలిపారు. సోమవారం శాతవాహన యూనివర్సిటీ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రైవేట్ కళాశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత రిజిష్ట్రార్, పరీక్షల నియంత్రణ అధికారికి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర రావు మాట్లాడుతూ గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ హామీ ఇచ్చి ఇప్పటివరకు నెరవేర్చలేదని అన్నారు.
రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు రెండు, నాలుగవ, ఆరవ సెమిస్టర్ తేదీలను ప్రకటించవద్దని కోరామన్నారు. పరీక్షల తేదీలను ప్రకటించి నిర్వహించడానికి ముందుకు వస్తే సెమిస్టర్ పరీక్షలను బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. 20 మాసాలుగా ఫీజుల బకాయిలతో సతమతమవుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి శ్రీపాద నరేష్, రాజన్న జిల్లా ఉపాధ్యక్షుడు అయాచితుల జితేందర్ రావు, ఓరగంటి విష్ణు పలు విద్యాసంస్థల కరస్పాండెంట్స్ పాల్గొన్నారు.