వేములవాడ రూరల్: వేములవాడ రూరల్ మండలంలోని మర్రిపల్లి కస్తూర్బా గాంధీ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు వేములవాడ రూరల్ ఎస్ఐ అంజయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైనా వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బిగే ఆదేశాలతో అంతర్జాతీయ యోగ దినోత్సవం జరుపుకుంటున్నమన్నారు. యోగ ప్రతీ ఒక్కరికి అవసరం అని, ప్రతీ రోజు ఉదయం కొంచెం సమయం యోగాకి కేటాయించాలన్నారు. ఆరోగ్యంగా ఉండటానికి, మానసిక ప్రశాంతతకు యోగా చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పారు. మంచి ఏకాగ్రత కలిగి మనం అనుకున్న పనులను సక్రమంగా నిర్వహించడంలో యోగా ప్రముఖ పాత్ర వహిస్తుందని తెలిపారు.
యోగా వల్ల మెదడు మనసు సమన్వయంతో ఉండి చెడు ఆలోచనలు లేకుండా, మంచి నిర్ణయాలు తీసుకోవటంలో ఉపయోగ పడుతుందని, తద్వారా మనం అనుకున్న లక్ష్యం చేరుకోవటంలో కూడా యోగ ఉపయోగపడుతుందని వెల్లడించారు. విద్యార్థులు డ్రగ్స్ పట్ల అవగాహన కలిగి ఉండి దానినుంచి దూరంగా ఉండాలని సూచించారు.అనంతరం విద్యార్థినిలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ ప్రధానోపాధ్యాయురాలు పద్మ, పాఠశాల సిబ్బంది, పోలీస్ సిబ్బంది, విద్యార్థినిలు పాల్గొన్నారు.