Vemulawada | బండి సంజయ్ వెంటనే కేంద్ర మంత్రి పదవి, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ తెలంగాణ చౌక్‌లో బీఆర్ఎస్ పట్టణ, అర్బన్, రూరల్, కోనరావుపేట మండలాల నాయకులు ధర్నా చేపట్టారు. పోక్సో కేసులో బాలికకు న్యాయం జరగాలన్నా, విచారణ పారదర్శకంగా సాగాలన్నా బండి సంజయ్‌ను కేంద్రమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. బండి సంజయ్ ధర్నా చేయాలంటే ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. బండి భగీరథ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోక్సో కేసు నమోదైన 8 రోజుల వరకు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని.. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కలిసి బండి భగీరథ్‌ను కాపాడుతున్నారనే విషయం తేటతెల్లమైందని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో వేములవాడ పట్టణ సీనియర్ నాయకులు రామతీర్థపు రాజు, అర్బన్ మండల సెస్ డైరెక్టర్ హరిచరణ్ రావు, ప్యాక్స్ చైర్మన్ రామ్మోహన్ రావు, రూరల్ మండల అధ్యక్షులు గోసుకుల రవి, కోనరావుపేట మండల అధ్యక్షులు మల్యాల దేవయ్య, మండలాల సర్పంచులు పాల్గొన్నారు.