Urea | సిరిసిల్ల రూరల్, సెప్టెంబర్ 9 : అన్నదాతకు యూరియా కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేపడుతున్నా రైతన్నలకు సరిపడా యూరియా అందుబాటులోకి తేవడంలో ప్రభుత్వం విఫలమైంది. ఎన్ని ఆందోళనలు చేపట్టిన చలనం లేని ప్రభుత్వ తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. యూరియా కొరతతో రైతులు ఆగమాగం అవుతున్నారు. ఉదయాన్నే సింగిల్ విండో గోదాములు, కార్యాలయాలు, రైతు వేదికలు, గ్రోమోర్ ఎరువుల దుకాణం, ఫర్టిలైజర్ దుకాణాల ఎదుట యూరియా కోసం బారులు తీరుతున్నారు.
మంగళవారం తెల్లవారుజామునే తంగళ్లపల్లి మండల కేంద్రంలోని గ్రోమోర్ ఎరువుల దుకాణం ఎదుట మండలంలోని పలు గ్రామాల్లోని రైతులు యూరియా కోసం బారులు తీరారు. అదేవిధంగా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని గ్రామైక్య సంఘంలో యూరియా అందిస్తారని సమాచారంతో ఉదయాన్నే రైతులు భారీగా చేరుకున్నారు.
యూరియా కోసం తమ పాస్ బుక్ , ఆధార్ కార్డు జిరాక్స్ పత్రాలను క్యూలైన్లో ఉంచారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు క్యూలో ఉన్నారు. గ్రోమోర్ దుకాణం వద్ద రైతులు నిర్వాహకులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. యూరియా కోసం రైతుకు ఒక టోకెన్ ఇచ్చి, ఒక్క యూరియా బస్తా అందించారు. ఒక్క యూరియా బస్తా సరిపోదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికారుల తీరుపై మండి పడ్డారు.
కలెక్టర్ వస్తున్నారని..
కలెక్టర్ వస్తున్నారని తంగళ్లపల్లిలో గ్రామైక్య భవనం వద్దకు యూరియా కోసం రైతులు ఉదయాన్నే చేరుకొని, పాస్ బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ పత్రాలను లైన్లో ఉంచారు. ఆ తరువాత కలెక్టర్ వస్తున్నారని, క్యూలైన్లో ఉన్న ఆధార్ కార్డులు పాస్‌బుక్ జిరాక్స్ పత్రాలను తొలగించి యూరియా కోసం రైతు వేదికకు వెళ్లాలని అధికారులు పంపించారు.
రైతు వేదికలో పాస్ బుక్, ఆధార్ కార్డును చూపించి ఏరియా టోకెన్ తీసుకుని రావాలని అధికారులు పంపించారు. తర్వాత రైతు వేదిక వద్దకు రైతులు చేరుకొని వ్యవసాయ అధికారులతో తమ టోకెన్లు తీసుకొని, తిరిగి గ్రామైక్య సంఘానికి చేరుకొని యూరియా బస్తాలు తీసుకొని వెళ్లారు. అంతకుముందు గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యూరియా యూనిట్‌ను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రారంభించారు.
Nepal | ఆగని ఆందోళనలు.. ఓలి రాజీనామాకు డిమాండ్.. మాజీ ప్రధాని ఇంటిని ధ్వంసం చేసిన నిరసనకారులు
BRS | రైతులకు సరిపడా యూరియా అందించండి.. కాల్వశ్రీరాంపూర్‌లో బీఆర్ఎస్ రాస్తారోకో
Aishwarya Rai | AIతో అశ్లీల కంటెంట్.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఐశ్వర్య రాయ్