రాజన్న సిరిసిల్ల : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఈత సరదా ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. స్థానికుల కథనం మేరకు..వేములవాడ మండలం మారుపాక గ్రామ శివారులోని కామరాజు కుంటలో ఈతకు వెళ్లి తూళ్ల రాజేశ్ (19) అనే యువకుడు మృతి చెందాడు. బర్రెలను కాస్తున్న క్రమంలో వాటిని బయటకు పంపి రాజు, రాజేశ్ ఇద్దరు ఈతకు వెళ్లారు. కుంటలోని లోతు ప్రాంతానికి వెళ్లడంతో రాజేశ్ మృతి చెందాడు.
రాజును స్థానికులు గమనించి కాపాడారు. మృతుడు వరంగల్ జిల్లా వర్ధన్నపేట గ్రామంగా గుర్తించారు. కొంత కాలంగా వీరి కుటుంబం రెడ్డి కాలనీలో పని చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. కాగా, బతుకుదెరువు కోసం వచ్చి ఎదిగిన కొడుకు ఇలా మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.