ఎల్లారెడ్డిపేట, సెప్టెంబర్ 9: బడికెందుకు పోలేదని తల్లి మందలించినందుకు ఓ బాలిక మనస్థాపం చెంది ఆత్మహత్యా యత్నం చేసుకుని మంగళవారం మృతి చెందిన ఘటన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జరిగింది. మృతురాలి బంధువులందించిన వివరాల ప్రకారం.. లకావత్ ఫరంగి-లలిత దంపతులకు ఒక్కగానొక్క కూతురు మధుమతి(16) ఉన్నది. లలిత తన కూతురు మధుమతితో కలిసి దుమాల శివారులో ఉంటూ వ్యవసాయ పనులు చేసుకుని కూతురును పోషించుకుంటున్నది.
మధుమతి దుమాలలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుకుంటున్నది.
ఆమె గత కొన్ని రోజుల నుంచి పదే, పదే పాఠశాలకు గైర్హాజరు అవుతున్నది. అలాగే గత నెల 31న లలిత వ్యవసాయ పనులకు వెల్లి వచ్చేసరికి తన కూతురు పాఠశాలకు వెల్లకుండా ఇంటి వద్దే ఉన్నట్లు తెలుసుకుని మందలించింది. దీంతో మధుమతి ఈ నెల ఒకటో తేదీన గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే చికిత్స నిమిత్తం మండల కేంద్రంలోని అశ్వినీ హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించి బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సిరిసిల్లకు తరలించారు.