Sircilla | రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం గోవింద నామస్మరణతో పులకరించింది. శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహారథోత్సవం కన్నుల పండువగా సాగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఈ రథోత్సవాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వామివారిని దర్శించుకున్నారు.
సిరిసిల్ల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో సెప్టెంబర్ 30వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల తరహాలోనే ఇక్కడ సైతం ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామివారి వాహనసేవలు జరుగుతుంటాయి.
ఇందులో భాగంగా ఆదివారం స్వామివారు ఉభయదేవేరులతో కలిసి రథంపై పురవీధుల్లో విహరించారు. అంతకు ముందు ఆలయంలో హోమం, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని రథంపై ప్రతిష్టించి, ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు రథంపై కొలువుదీరిన స్వామివారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం సమయంలో రథోత్సవం నిర్వహించగా.. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జాతరకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.