సిరిసిల్ల కలెక్టరేట్ : రాష్ట్ర బడ్జెట్లో(Budget) విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. ధర్నా అనంతరం ఏఓ రామ్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుండెల్లి కళ్యాణ్, మల్లారపు ప్రశాంత్ మాట్లాడుతూ.. బడ్జెట్లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించి, వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. విద్యా రంగానికి తగిన నిధులు కేటాయించకపోవడం వల్ల విద్యారంగం మొత్తం నిర్వీర్యం అయిపోతుందన్నారు.
విద్యార్థులకు గత కొన్ని సంవత్సరాలుగా స్కాలర్షిప్స్కు రాక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి మధ్యాహ్న భోజనానికి నిధులు కేటాయించాలని ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచాలన్నారు. లేదంటే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు పిలుపునిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు జాలపల్లి మనోజ్ కుమార్, గర్ల్స్ కన్వీనర్ సంజన, జిల్లా కమిటీ సభ్యులు సాయి, భరత్, శివ, నాయకులు రాహుల్, శ్రీధర్, సాయికుమార్, మధు, తదితరులు పాల్గొన్నారు.