సిరిసిల్ల రూరల్, మార్చి 12: అర్హులందరూ ఎల్ఆర్ఎస్ను(LRS) సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపు నిచ్చారు. తంగళ్లపల్లి మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ప్రజాపాలన కౌంటర్ ను పరిశీలించి, ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి? వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం టీ ఫైబర్ సర్వర్ రూం ను పరిశీలించి, మండలంలో ఇంటి, ఇతర పన్నుల వసూలు పై ఆరా తీశారు. మండలంలో భూముల క్రమబద్ధీకరణకు సంబంధించిన దరఖాస్తులపై ఆరా తీశారు. ఈ సందర్బంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంటి, ఇతర పన్నులను సకాలంలో చెల్లించాలని పేర్కొన్నారు.
అనంతరం నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ వైద్య సేవలు సద్వినియోగం చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్యులు, సిబ్బందికి సూచించారు. ప్రభుత్వ దవాఖానలోనే ప్రసవాలు అయ్యేలా చూడాలని పేర్కొన్నారు. నేరెళ్లలోని టీజీఆర్ఎస్ (గర్ల్స్) విద్యాలయాన్ని తనిఖీ చేశారు. పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రత్యేక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మీనారాయణ, ఎంపీఓ మీర్జా, డాక్టర్ చంద్రికా రెడ్డి ఉన్నారు.