రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్, ఫిబ్రవరి, 21 : జిల్లాలో ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా (Sandeep Kumar Jha )సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంటర్, పదో తరగతి పరీక్షల నిర్వహణపై శుక్రవారం సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూలు ప్రకారం కట్టుదిటమైన ఏర్పాట్లు చేయాలన్నారు.
జిల్లాలో మార్చి 5,2025 నుంచి మార్చి 25, 2025 వరకు ఇంటర్, మార్చి ,21 నుండి 04 ఏప్రిల్ 2025 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహిస్తామని, దీనికి తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలు ఉ. 9.00 నుండి మ.12.00 వరకు పరీక్షలు జరుగుతాయని, ఇంటర్ మొదటి సం.5065, రొండవ సం.4245 మొత్తం 9310 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరు కానున్నట్లు ఇందుకు గాను 16 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు వివరాలను వెల్లడించారు. ఈ సంవత్సరం మొదటి సారిగా ప్రతి సెంటర్ లో సి.సి. కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు, సెంటర్ అడ్రస్ రూట్ మ్యాప్ వివరాలు తెలిపే విధంగా హాల్ టికెట్ పై QR కోడ్ ముద్రిస్తామన్నారు.
పదోతరగతి లో 3051 బాలురులు, 3717 బాలికలు మొత్తం 6768 మంది విద్యార్దులు పరీక్షలు రాయనున్నట్లు వీటి నిర్వహణకు 36 పరీక్షా కేంద్రాలను, ప్రతి కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్ట్మెంటల్ ఆఫీసర్, స్టేట్ లెవెల్ అబ్జర్వర్ ఫ్లయింగ్ వర్డ్ సిట్టింగ్ స్క్వేర్లను నియమించామన్నారు. ఉ. 9.30 నుంచి మ.12.30 వరకు పరీక్షలు జరుగుతాయని అధికారులు తెలిపారు. విద్యార్థులు ఒక గంట ముందుగా పరీక్షా కేంద్రానికి హాజరుకావాలని సూచించారు. సమావేశంలో ఆర్.డి.ఓలు రాజేశ్వర్, రాధాబాయి, జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి శ్రీనివాస్, డి.ఎం.హెచ్.ఓ డా.రజిత, తదితరులు పాల్గొన్నారు.