Sircilla | సిరిసిల్ల రూరల్, అక్టోబర్ 13: సిరిసిల్ల మానేరువాగులోని చెక్ డ్యాంలు, పరిసర ప్రాంతం దావత్ లకు కేంద్రంగా మారింది. చెక్ డ్యాం ప్రాంతంలో మద్యం సేవిస్తూ.. పార్టీలు చేసుకుంటున్నారు. బహిరంగంగా మద్యం సేవించి పార్టీలు చేసుకుంటున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు.
ఇటీవల కురిసిన వర్షాలతో ఎగువ మానేరు నిండి మానేరువాగు పారింది. దీంతో మానేరు వాగులో చెక్ డ్యాంలు మత్తడి దూకాయి. దీంతో సందర్శకులు సైతం వస్తుండటంతోపాటు మందుబాబులకు అడ్డగా మారాయి. పలువురు దావత్లు చేసుకుంటూ, నీటిలో దిగి జలకాలాడుతున్నారు. శనివారం తంగళ్లపల్లి మండలం కస్బెకట్కూర్ గ్రామానికి చెందిన లాల రాజు ఈతకోసం వెళ్లి మృతి చెందిన విషయం తెలిసిందే. గతంలో కూడా పలు ప్రమాదాలు జరిగాయి. మానేరు వాగులోని నెహ్రునగర్ ఆంబ భవాని ఆలయ ప్రాంగణంలో చెక్ డ్యాంలో గతంలో రాజీవ్ నగర్ కు చెందిన ముగ్గురు బాలురు గల్లంతై మృత్యువాత పడిన విషయం కలకలం రేపింది. దీంతో అప్పటి పోలీసు బాస్ చెక్ డ్యాం, నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఇటీవలే వర్షాలతో చెక్ డ్యాంలు సైతం పూర్తిగా నీటితో నిండినప్పటికి సరైన నిఘా, పర్యవేక్షణ లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిఘా, పర్యవేక్షణ ఉంటే ప్రమాదాలు జరకుండాప్రాణాలు కాపాడవచ్చని అంటున్నారు. ఇప్పటికైనా చెక్ డ్యాం, నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో నిఘా ఉంచాలని స్థానికులు కోరుతున్నారు. ఈవిషయంపై ఎస్సై ఉపేంద్రచారిని వివరణ కోరగా చెక్ డ్యాం, నీటి వనరుల ఉన్న ప్రాంతాల్లో నిఘా ఉంచుతామని తెలిపారు. బ్లూకోల్ట్ పోలీసు, పెట్రోలింగ్ సైతం నిర్వహిస్తామని పేర్కొన్నారు. అనుమానస్పదంగా వ్యక్తులు సంచరిస్తే సమాచారం అందివ్వాలని, తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.