Vemulawada | వేములవాడ రాజన్న ఆలయంలో ఓ కోడె సొమ్మసిల్లిపడిపోయింది. భక్తుల రద్దీకి అనుగుణంగా శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో అద్దె కోడలను అధికారులను నిర్వహిస్తుంటారు. అయితే సోమవారం ఉదయం మొదటి షిఫ్ట్‌లో ఆలయానికి వచ్చిన ఓ కోడె అకస్మాత్తుగా రాజన్న ఆలయ ప్రధాన ద్వారం ముందు సొమ్మసిల్లిపడిపోయింది. అయినప్పటికీ దాన్ని గమనించుకుండా భక్తులు ప్రదక్షిణలు చేయడంలో మునిగిపోయారు. అధికారులు కూడా నిర్లక్ష్యంగా ఉండటంతో పడిపోయిన కోడెను పట్టించుకునే నాథుడే లేనట్లుగా పరిస్థితి ఉండిపోయింది. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజన్న కోడెల విక్రయం వార్తలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.
వేములవాడ రాజన్నకు కోడె మొక్కులు ఎందుకు చెల్లిస్తారు?
వేములవాడ రాజన్న అనగానే గుర్తుకొచ్చేది కోడె మొక్కులు. యవ్వనంలో ఉన్న కోడెలను రాజన్నకు సమర్పిస్తే కోరుకున్నవి జరుగుతాయని నమ్మకం. ఈ సంప్రదాయానికి ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు శ్రీకారం చుట్టాడని స్థల పురాణం. శ్రీకృష్ణుడు, జాంబవతి దంపతులకు రాజరాజేశ్వరుడి అనుగ్రహంతో సాంబుడనే కొడుకు కలిగాడట. పుత్రుణ్ని వరంగా ప్రసాదించిన రాజన్నకు కోడెను మొక్కుగా చెల్లించుకున్నాడట శ్రీకృష్ణుడు. నేటికీ కోడె మొక్కు సంప్రదాయం కొనసాగుతుండటం విశేషం.