సిరిసిల రూరల్, డిసెంబర్ 1: గ్రామ పంచాయతీ ఎన్నికల (Panchayathi Elections) నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు గ్రామాల్లో ఏకగ్రీవ ఎన్నికకు (Unanimous) తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో ఓ సామాజికవర్గంలో ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని ఇద్దరు వ్యక్తులు ఒత్తిడి తెచ్చారనే సమాచారంతో, పోలీసులు అదుపులోకితీసుకొని కేసు నమోదుచేశారు. అనంతరం ఇద్దరిని తహసిల్దార్ ఎదుట బైండోవర్ చేసి వదిలేశారు. అదేవిధంగా తంగళ్లపల్లి మండలంలోని మరో గ్రామంలో మరో సామాజిక వర్గం కులం కట్టు పెట్టడం కలకలం రేపింది. విషయం బయటకు పొక్కడం పోలీసులు రంగంలోకి దిగి, గ్రామంలో కుల సంఘాలకు అవగాహన కల్పించారు. ఈ రెండు ఘటనలు జిల్లాలో చర్చనీయాంశమైంది.
భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడు ఎన్నికల్లో పోటీ చేయవచ్చని, తన ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించబడిందనీ సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి పేర్కొన్నారు. ఈ మేరకు తంగళ్ల పల్లి మండలం సారంపల్లిలో ఆదివారం రాత్రి కుల సంఘాలతో మాట్లాడారు. కమ్యూనిటీ పరంగా కొంతమంది, కొన్ని కుటుంబాలు, కొన్ని కులాల వారు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయాలనీ, మిగిలినవారు చేయకూడదని మిగతా వారిపై ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు.
అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే మండేపల్లి గ్రామంలో ఏకగ్రీవం కోసం ఒత్తిడి తెచ్చిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి, తంగళ్లపల్లి ఎమ్ఆర్ఓ ఎదుట హాజరు పరచామని తెలిపారు. అంతకు ముందు జిల్లెల్ల చెక్పోస్టును తనిఖీ చేశారు. కార్యక్రమంలో సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి, తంగళ్ళపల్లి ఎస్ఐ ఎం.ఉపేంద్ర చారి, సిబ్బంది, ఇతరులు పాల్గొన్నారు.