సిరిసిల్ల రూరల్, జూన్ 5: రైల్వేలైన్ కోసం భూ సేకరణ జాబితాలో అతని భూమి లేకున్నా సేకరించి, పరిహారాన్ని మరొకరికి ఇచ్చిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నర్సింహులపల్లేలోవెలుగు చూసింది. తన భూమి మళ్లీ ఆన్లైన్లో ఎక్కించాలని రైతు అబ్రవేని రఘుపతి గత రెండేండ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. అయితే గురువారం గ్రామంలో జరిగిన భూ భారతి రెవెన్యూ సదస్సులో తన సమస్య పరిష్కరించాలని లిఖిత పూర్వకంగా దరఖాస్తు చేశాడు. వివరాల్లోకి వెళితే.. రఘుపతికి గ్రామంలోని సర్వే నంబర్ 81లో 81/8/1లో 1.06 ఎకరాల భూమి ఉన్నది. వారసత్వంగా రావడంతో ఎవుసం చేసుకుంటూ జీవిస్తున్నాడు.
అయితే తన గ్రామం నుంచి రైల్వేలైన్ వెళ్తుండటంతో రెండేండ్ల కింద అధికారులు భూమిని సేకరించి, రైతులకు పరిహారం అందించారు. సర్వే నెంబర్ 81లో రైల్వేలైన్ లేకపోవడంతో రఘుపతి నిశ్చింతంగా ఉన్నాడు. అయితే ఆన్లైన్లో తన భూమిని కట్ చేశారని, పరిహారాన్ని మరొకరికి అందజేశారని తెలుసుకొని షాక్ తిన్నాడు. అధికారులు, కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతోపాటు తన భూమి తన పేరిట ఎక్కించాలని తిరుగుతున్నాడు. తాజాగా గురువారం గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో అర్జీ పెట్టుకున్నాడు. సమస్యను పరిష్కరిచాలని తహసీల్దార్ జయంత్ కుమార్ ను వేడుకున్నాడు. ఇప్పటికైనా తన సమస్య పరిష్కారం అవుతుందేమో వేచి చూడాల్సిందే.