రాజన్న సిరిసిల్ల,జనవరి 21(నమస్తే తెలంగాణ): ‘ఆ మార్కండేయుడి ఆశీస్సులతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ, పట్టణం, కుటుంబాలు బాగుండాలనీ బీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KIR) ఆకాక్షించారు. జిల్లా కేంద్రమైన సిరిసిల్లలో శ్రీ మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాలు బుధవారం వైభవంగా జరిగాయి. శ్రీ శివభక్త మార్కండేయ జయంతిని పురస్కరించుకోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు. ఈ వేడుకలకు కేటీఆర్ హాజరయ్యారు.
మార్కండేయ జయంతి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు చేసిన కేటీఆర్ పద్మశాలీలతో కలిసి మార్కండేయ స్వామి శోభయాత్రలో పాల్గొన్నారు. మార్కండేయ ఆలయం నుంచి గాంధీచౌక్, అంబేద్కర్ చౌక్, నేతన్న చౌరస్తా వరకు శోభయాత్ర కొనసాగింది. నేతన్న చౌక్‌లో నేతన్న విగ్రహానికి కేటీఆర్ పూలమాలు వేశారు. కేటీఆర్ రాకతో శోభయాత్రలో పద్మశాలీలు ఉత్సహాంగా పాల్గొన్నారు. అంతకుముందు కేటీఆర్‌కు పద్మశాలి సంఘం నేతలు, అనుబంధ సంఘాల నేతలు, బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు.
శోభయాత్ర కన్నుల పండువగా పురవీధుల్లో కోనసాగింది. భక్తులు, యువతుల కోలాటం సంస్కృతి సంప్రదాయంగా ఆడిపాడారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు దూడం శంకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాఫస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, టీపీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, మాజీ కౌన్సిలర్లు, పద్మశాలీ సంఘ డైరెక్టర్లు, అనుబంధ సంఘాల నేతలు, పద్మశాలీలు పాల్గొన్నారు.