సిరిసిల్ల రూరల్, డిసెంబర్ 1: రాజన్న సిరిసిల్ల జిల్లా (Sircilla) తంగళ్లపల్లి మండలం మండెపల్లి శివారులోని కేసీఆర్ నగర్‌ను (KCR Nagar) ప్రత్యేక గ్రామపంచాయతీ (Grama Panchayathi) ఏర్పాటు ఆటకెక్కింది. ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు కోసం ఆందోళనలు చేసిన కేసీఆర్ నగర్ వాసులకు, గత కొంతకాలంగా ఊరించిన ప్రభుత్వం, అధికారులు తీరా ప్రక్క గ్రామపంచాయతీలోని ఇందిరమ్మ కాలనీలో కలిపారు. ఈమేరకు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌తో తేటతెల్లమైంది. కేసీఆర్ నగర్ ప్రత్యేక గ్రామపంచాయతీ చేసుకోవాలనుకుంటున్న కేసీఆర్ నగర్ వాసుల కల కలగానే మిగిలింది. కేసీఆర్ నగర్‌కు కేవలం రెండు వార్డులు కేటాయించి, గ్రామపంచాయతీఏర్పాటును పట్టించుకోకవపోడం గమానార్హం. దీంతో సర్వత్ర విమర్శలు తావిస్తున్నది.
కేసీఆర్ సర్కార్ హయాంలో అప్పటి మంత్రి కేటీఆర్ ప్రతిష్టాత్మకంగా పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేపట్టారు. సిరిసిల్ల పట్టణ వాసుల కోసం తంగళ్లపల్లి మండలం మండెపల్లి శివారులోని ప్రభుత్వ భూమిలో 1320 డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించారు. రాష్ట్రంలోనే ఆదర్శంగా నిర్మాణం చేశారు. ఈ ఇళ్ల సముదాయానికి కేసీఆర్ నగర్‌గా నామకరణం చేశారు. 2022లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అప్పటి నుంచి లబ్దిదారులు ఇక్కడ నివాసం ఉంటున్నారు. సుమారు 1380పైగా ఓటర్లు, 2500 మంది జనాభా ఉంటున్నారు. కాగా రాష్ట్రంలో ప్రభుత్వం
మారడంతో కేసీఆర్ నగర్ కాలనీ వాసులకు కష్టాలు మొదలయ్యాయి. కేసీఆర్ నగర్లో సమస్యలను పట్టించుకోకపోవడం, తాగునీటికి, పారిశుద్ధ్య పనులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రత్యేక గ్రామపంచాయతీ తోనే తమ సమస్యలు పరిష్కారమవుతాయని కేసీఆర్ నగర్ వాసులు ఆందోళనలు చేశారు. కలెక్టర్‌తోపాటు ఇతర అధికారులు, అధికార పార్టీనే తలను సైతం కలిసి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది.
తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ (టెక్స్ టైల్ పార్క్)లో కేసీఆర్ నగర్‌ను కలిపారు. ఈనెల 25న విడుదల చేసిన పంచాయతీ ఎన్నికల నోటిపికేషన్లో ఇందిరమ్మ కాలనీలోనే కేసీఆర్ నగర్ ఓటర్లను చూపించారు. ఇందిరమ్మ కాలనీ గ్రామపంచాయతీలో 8 వార్డులను విభజించగా, ఇందులో రెండు వార్డులను కేసీఆర్ నగర్‌కు కేటాయించారు. సర్పంచ్ రిజర్వేషన్ జనరల్‌గా ఖరారైంది.
గ్రామంలో 4442 మంది జనాభా ఉండగా, 3452 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1582 పురుషులు, 1869 మంది మహిళలు ఉన్నారు. ఇక్కడ పట్నం ఓటర్లు పల్లె ఓటర్లుగా మారడం గమనార్హం.
ప్రభుత్వంస్పందించకపోవడంతోనే కేసీఆర్ నగర్ ప్రత్యేక గ్రామపంచాయతీ ఏర్పాటు కాలేదని తంగళ్లపల్లి బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న అన్నారు. ఇక్కడ కేసీఆర్ నగర్ వాసులు ఆందోళనలు, విజ్ఞప్తులు చేసిన పట్టించుకోలేదు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్, మండల పరిషత్ అధికారులకు స్వయంగా కలిసి వినతి పత్రాలు ఇచ్చి కోరినం. అయిన ఎటువంటి స్పందన లేదు. 1200 మందిపైగా ఓటర్లు ఉన్నా గ్రామపంచాయతీ ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరం. ప్రస్తుతం ఇందిరమ్మకాలనీలో కలపడం, వార్డులు కూడ రెండే కేటాయించడం సరైంది కాదు. ఇప్పటికైనా వార్డుల సంఖ్య పెంచాలి. ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.