Kamareddy | సిరిసిల్ల రూరల్, అక్టోబర్ 12: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం దేశాయిపల్లెకు చెందిన యువకుడు మేకల అఖిల్ యాదవ్‌ను కామారెడ్డి జిల్లా ఎస్పీరాజేశ్ చంద్ర సన్మానించారు. కామారెడ్డి జిల్లాలో అంతరాష్ట్ర దొంగ నోట్ల ముఠా పట్టుకోవడంలో సహకరించిన దేశాయిపల్లె యువకుడు అఖిల్ యాదవ్‌కు విలేకరుల సమావేశంలో శాలువాను కప్పి, జ్ఞాపికను అందించి శనివారం ఘనంగా సత్కరించారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ వైన్స్ దుకాణంలో మేకల అఖిల్ పనిచేస్తున్నాడు. అక్కడ సెప్టెంబర్ 23న కామారెడ్డి జిల్లా శాబ్దిపూర్కు చెందిన సిద్ధాగౌడ్ నకిలీ రూ.500 నోట్లతో మద్యం కొనుగోలు చేయగా, ఆది గుర్తించిన అఖిల్ పోలీసులకు సమాచారం అందించారు. అఖిల్ ఇచ్చిన సమాచారంతో దర్యాప్తు చేపట్టారు. సిద్ధా గౌడ్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. ఈ క్రమంలో అంతరాష్ట్ర దొంగ నోట్ల ముఠా విషయం వెలుగులోకి వచ్చింది. నకిలీ కరెన్సీని ప్రింట్ చేసి పలు రాష్ట్రాలకు కొరియర్ ద్వారా వాటిని పంపిస్తున్నారని తెలిసింది. ఈ నెల 11న దొంగ నోట్ల ముఠాను పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. కాగా, అంతరాష్ట్ర దొంగ నోట్ల ముఠాను పట్టుకోవడానికి సహకరించిన అఖిల్‌ను ఎస్పీ రాజేశ్ చంద్ర సన్మానించారు.