చందుర్తి, మే19 : వంతెన నిర్మించి రైతుల ఇబ్బందులను పరిష్కరించాలని సామాజిక సేవకుడు పుప్పాల మోహన్ డిమాండ్ చేశారు. మంగళవారం సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఎన్గల్ గ్రామంలోని ఎల్లమ్మ ఆలయం ఎదుట రహదారిపై గ్రామస్తులతో కలిసి పడుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీత కార్మికులు, రైతులు తమ పంట పొలాలకు వివిధ పనుల కోసం వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
వర్షాకాలంలో పశువులు కొట్టుకుపోయి, ప్రమాదాలు జరిగిన ఘటనలను గుర్తు చేశారు. ప్రభుత్వ పెద్దలు నిధులు మంజూరు చేశామని చెబుతూ దాటవేసే ధోరణిని అవలంబిస్తున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపి వంతెన నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు.