ఎల్లారెడ్డిపేట, జూలై 17: గత కొంత కాలంగా మల్కపేట కెనాల్ కట్టను ఆనుకుని ఉన్న పొలాలే టార్గెట్గా అక్రమ మట్టి తరలింపు ప్రక్రియ యథేచ్ఛగా కొనసాగుతున్నది. కాగా, ఓ రైతుకు తెలియకుండా తన భూమిలోంచి మట్టి తరలించిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన చెందిన నిమ్మల వేణుకు మల్కపేట కెనాల్ కట్టను ఆనుకుని ఓ ఎకరం భూమి ఉంది.
ఇటీవల తన భూమిలోంచి సుమారు ఆరు ట్రిప్పుల మట్టిని తనకు తెలియకుండానే తీసినట్లు గుర్తించి ఆరా తీశాడు. తీరా మట్టిని అక్రమంగా తరలించింది తమ గ్రామానికి చెందిన వ్యక్తే అని తెలియడంతో సదర వ్యక్తిని ఎందుకు తీశావని వేణు ప్రశ్నించాడు. దీంతో ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని బెదిరింపులకు పాల్పడతున్నాడని రైతు వేణు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది వరకే అక్రమంగా మట్టిని తరలిస్తున్న సదరు వ్యక్తిపై అనేక ఆరోపణలున్నా అధికారులెందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించాడు. దీనిపై పోలీసులు, తహసీల్దారు కార్యాలయంలో ఫిర్యాదు చేయనున్నట్లు బాధిత రైతు తెలిపాడు.