రాజన్న సిరిసిల్ల, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : ఇండో, జర్మనీ సహకారంతో సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జర్మనీ అహార వ్యవసాయ మంత్రిత్వశాఖ, ప్రౌన్హోఫర్ హెయిన్రిచ్ హార్ట్ ఇనిస్ట్యూట్ జర్మనీ బృందం శుక్రవారం సిరిసిల్ల సెస్‌ను సందర్శించింది. పాలకవర్గ చైర్మన్ చిక్కాల రామారావు, అధికారులతో కలిసి సెస్ పరిధిలో విద్యుత్ సబ్స్టేషన్లు పెద్దూరులోని 220కేవీని పరిశీలించారు. అనంతరం సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ కార్యాలయానికి చేరుకుని పాలకవర్గంతో బేటీ అయ్యారు.
జర్మనీ ప్రతినిధుల బృందంలోని రెబాక, మార్టిన్, సెవాన్, సెబస్టన్, డాక్టర్ రఘులు సెస్ పనితీరును ప్రశంసించారు. సెస్ పరిధిలోని వినియోగాదారుల సంఖ్య, వ్యవసాయ మోటార్లు, పరిశ్రమలు, గృహా అవసరాలకు సంబంధించి విద్యుత్ కనెక్షన్లు, వ్యవసాయం నడుస్తున్న తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాధనం 60 శాతం, జర్మన్ డెవలప్ బ్యాంకు సహకారంతో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంటు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించినట్లు తెలిపారు.
మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సూచన మేరకు సిరిసిల్లను వచ్చినట్లు చెప్పారు.
త్వరలో సిరిసిల్ల సెస్ సోలార్ హబ్‌గా అభివృద్ధి చెందుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తే ప్రాజెక్టు త్వరిత గతిన పూర్తి చేస్తామని చెప్పారు. సెస్ చైర్మన్ చిక్కాల రామారావు మాట్లాడుతూ వినియోగదారులు భాగస్వామ్యంతో నడుస్తున్న సహకార విద్యుత్ సంస్థ ప్రస్థుతం ట్రాన్స్‌కో నుంచి విద్యుత్ కొనుగోలు చేసి వినియోగదారులకు విక్రయిస్తుందని తెలిపారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ సెస్ పరిధిలో ఏర్పాటు చేస్తే కరెంటు కొనుగోలు చేసే అవసరం ఉండదన్నారు. కార్యక్రమంలో సెస్ వైస్‌చైర్మన్ దేవరకొండ తిరుపతి, డైరెక్టర్లు దార్నం లక్ష్మీనారాయణ, హరికృష్ణ, రమాదేవీ, ఎండీ విజేందర్‌రెడ్డి, ఏవో శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.