Sircilla | తెలంగాణ చౌక్, మార్చి 03: ఆన్లైన్ సెంటర్ల ఎలక్షన్ గా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఐదుగురుపై కేసు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అరెస్టు వివరాలను వెల్లడించారు.
మహారాష్ట్రలోని భీవండికి చెందిన దాసరి మురళి అనే వ్యక్తి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తూ వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తున్నాడు. అయితే విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన మురళి ఈజీగా డబ్బు సంపాదించాలని భావించాడు. తన స్నేహితులైన విలేజ్, రమేశ్, జీతంత్ర సోనూభాయ్, నీలేశ్ జైల్ సింగ్‌తో కలిసి ఒక ముఠాగా ఏర్పడి మోసాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలోనే వేములవాడ పరిధిలోని అగ్రహారం చీర్లవంచ ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన ఆన్లైన్ సెంటర్ నిర్వహిస్తున్న వినుకొండ మహేశ్ అనే వ్యక్తికి ఫోన్ చేసి సివిల్ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ రాజిరెడ్డి అని పరిచయం చేసుకున్నాడు. మీకు మనీ ఇస్తా.. నా అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారా.. ఇందుకు కమీషన్ ఇస్తానని చెప్పాడు.
అనంతరం సిరిసిల్ల పట్టణంలోని ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడికి మురళి ఫోన్ చేశాడు. తాను ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లెక్చరర్‌గా పనిచేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు. 110 బిర్యానీలను ఆర్డర్ చేశాడు. ఆ బిర్యానీలకు డబ్బులు అడగ్గా.. అగ్రహారంలోని మహేశ్ వద్దకు వెళ్లి తీసుకోవాలని సూచించారు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడు మహేశ్ దగ్గరికి వెళ్లి మురళికి ఫోన్ చేశాడు. అతని సూచన మేరకు మహేశ్ రెండు దఫాలుగా రూ.60వేలు ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడికి ఇచ్చాడు. ఆ తర్వాత కొద్దిరోజులయ్యాక ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడికి మహేశ్ ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని కోరాడు. అప్పుడు తనకే రూ.5వేలు వస్తాయని మహేశ్ చెప్పాడు. అదేంటని ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడు నిలదీయడంతో అసలు విషయం తెలిసింది. దీంతో ఇద్దరూ మోసపోయామని గ్రహించిన ఇద్దరూ వేములవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
సీఐ వీరప్రసాద్ ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన స్పెషల్ టీం.. టెక్నాలజీ ఆధారంగా నిందితులు మహారాష్ట్రలోని భీమడోలులో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లి దర్యాప్తు చేసి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఇందులో ప్రధాన నిందితుడైన దాసరి మురళి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరిపై దేశవ్యాప్తంగా ఉన్న 54 ఫిర్యాదుల్లో 30 లక్షల దాకా మోసం చేసినట్లు గుర్తించారు.