సిరిసిల్ల రూరల్, సెప్టెంబర్ 12 : రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. ఒక్క బస్తా యూరియా కోసం ఉదయాన్నే సింగిల్ విండో గోదాములు ,రైతు వేదికలు, ఫర్టిలైజర్ దుకాణాలకి చేరుకొని బారులు తీరుతున్నారు. తెల్లవారుజామున యూరియా కోసం వచ్చి, గంటల తరబడి క్యూలో ఉంటున్నారు. శుక్రవారం ఉదయాన్నే తంగళ్లపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికకు మండలంలోని పలు గ్రామాల్లోని రైతులు భారీగా చేరుకున్నారు.
క్యూలో పాస్ బుక్, ఆధార్ కార్డ్ జిరాక్స్ పత్రాలను ఉంచారు. కెడిసియంఎస్ పర్టిలైజర్ దుకాణంకు 450 యూరియా బస్తాలు రాగా, రైతు వేదిక వద్ద రైతులకు వ్యవసాయ అధికారులు యూరియా టోకెన్లు రైతులకు అందించటం గమనార్హం. టోకెన్లు తీసుకున్న రైతులు, మరో చోట ఉన్న గోదాంకు వెళ్లి యూరియా బస్తాలు తీసుకున్నారు. టోకెన్లు ఒకచోట..పంపిణీ మరో చోట ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
మహిళా రైతులు ఉదయానే వచ్చి, గంటల తరబడి క్యూలో ఉండి ఇబ్బందులు పడ్డారు. 450 బస్తాలు రాగా, సుమారు 700 మందికి పైగా రైతులు రావడం గమనార్హం. సుమారు 250 మంది రైతులు తీవ్ర నిరాశతో తిరిగి వెళ్లారు. ప్రభుత్వం, అధికారుల తీరు పై అసహనం వ్యక్తం చేశారు. రైతులకి యూరియా సరిపడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.