Passbooks | సిరిసిల్ల రూరల్, ఆగష్టు 19 : ఓ వైపు విస్తారంగా వర్షాలు పడుతుంటే రాష్ట్రవ్యాప్తంగా రైతులకు యూరియా కోసం తిప్పలు తప్పడం లేదు. వివిధ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా రైతన్నకు యూరియా వెతలు తప్పడం లేదు. యూరియా కొరత ఉండడంతో సింగిల్ విండో కార్యాలయాలు, గోదాముల వద్ద ఉదయాన్నే రైతులు చేరుకొని బారులు తీరారు. తంగళ్లపల్లి మండలం మండేపల్లిలోని సింగిల్ విండో గోదాంలో 250 యూరియా బస్తాలు రాగా, సుమారు 500 మంది రైతులు గోదాం వద్దకు చేరుకున్నారు.
ఉదయాన్నే యూరియా కోసం రైతులు బారులు తీరారు. యూరియా కొరత ఉండటంతో పోలీసులు చేరుకొని, రైతులను సముదాయించారు. రైతు భూమి పాస్ బుక్కు, ఆధార్ కార్డు జిరాక్స్ పత్రాలను క్యూలైన్లో ఉంచారు. గోదాంలో సరిపడా యూరియా లేకపోవడంతో రైతులు ఆందోళన చేపట్టారు. సరిపడా యూరియా ఎందుకు ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని, అధికారులను రైతులు ప్రశ్నించారు. వీరికి మద్దతుగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గజబీంకార్ రాజన్న, బీఆర్ఎస్ పార్టీ నేతలు చేరుకొని మద్దతు పలికారు. సరిపడా యూరియా లేకపోవడంతో రైతులు నిరాశతో తిరిగి వెళ్లారు. కాగా సింగిల్ విండో నుంచి 600 బస్తాలకు పేమెంట్ చెల్లించగా, కేవలం 250 బస్తాలు రావడం గమనార్హం.
రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది: బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజన్న
రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గజభీంకార్ రాజన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తంగళ్ళపల్లి మండలం మండేపల్లి లో సింగల్ బండ గోదాం వద్దకు తరలి వెళ్లి రైతులకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండేపల్లిలో సిరిసిల్ల PACS ద్వారా యూరియా ఇస్తున్నారని తెలిసి వందలాది మంది రైతులు రావడం జరిగింది.
యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం 250 బస్తాల యూరియా రాగా 500 మంది రైతులు వచ్చారు. ఐదు ఎకరాలలోపు ఉన్న రైతులకు కేవలం ఒక్క యూరియా బస్తా మాత్రమే ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుచూపు వైఖరి లేకపోవడం వల్ల రైతుల పట్ల ఉదాసీన వైఖరి అవలంబించడంతో రైతులు యూరియా కొరకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వికలాంగులు వృద్ధులు మహిళలు కూడా యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు అవసరమైనంత యూరియాను సప్లై చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. ఆయన వెంట పార్టీ నేతలు కందుకూరి రామాగౌడ్, డాక్టర్ నక్క రవి, రాగి పెళ్లి కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ దుర్గయ్య గౌడ్, రైతులు ఉన్నారు.
Vice president | ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ జడ్జి..!
Yellampally project | ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పై నుంచి రాకపోకలు బంద్
TLM Mela | టీఎల్ఎం మేళాతో బోధన సులభతరం : ఎంఈవో చంద్రశేఖర్ రెడ్డి