సిరిసిల్ల రూరల్, ఆగష్టు 18: రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. యూరియా బస్తాల కోసం రైతులు సింగల్ విండో గోదాములు, ఫర్టిలైజర్ దుకాణాల్లో పడిగాపులు కాస్తున్నారు. జిల్లా కేంద్రమైన సిరిసిల్లలోని సిరిసిల్ల సింగిల్ విండో కార్యాలయంకు తెల్లవారు జామునే రైతులు చేరుకొని, క్యూ లైన్ లో నిలిచి ఉన్నారు. సుమారు 2 గంటల పాటు క్యూ లైన్లో ఉన్న రైతులను, వ్యవసాయ అధికారుల నుంచి యూరియా బస్తాల కోసం రాయించుకొని రావాలని తిప్పి పంపారు. దీంతో రైతులు ఆగమేఘాల మీద ఆధార్ కార్డు జిరాక్స్, పట్టాదారు పాస్బుక్ జిరాక్స్ తీసుకొని చంద్రంపేటలోని జిల్లా రైతు వేదికకు తరలి వెళ్లారు.
అక్కడ రైతు వేదికలో సైతం టోకెన్లు రాయించుకోవడానికి బారులు తీరారు. అక్కడ కూడా క్యూ లైన్ లో ఉండి రాయించుకొని తిరిగి సిరిసిల్ల లోని సింగల్ విండో కార్యాలయంకు వచ్చి యూరియా బస్తాలు తీసుకున్నారు. యూరియా కోసం రైతులను ఆగమాగం చేస్తున్నారని, రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇబ్బందులు గురిచేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం తెల్లవారుజామున వస్తే యూరియా దొరకడం లేదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి యూరియా సక్రమంగా రైతులకు అందరికీ అందేలా చూడాలని కోరుతున్నారు.