కోనరావుపేట, జూలై 10: ఆర్ధిక కష్టాలను కుటుంబాన్ని గట్టెక్కించేందుకు గల్ఫ్ దేశానికి వెళ్లిన ఓ వ్యక్తి జీవితం విషాదాంతమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన ఆసరి వెంకటేశ్వర్లు (40) ఒమన్ రాజధాని మస్కట్‌లో మృతి చెందాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చాలనే ఉద్దేశంతో మూడేళ్ల క్రితం ఒమన్‌కు వెళ్లిన వెంకటేశ్వర్లు గుండెపోటుతో మరణించాడు. ఆయన మరణ వార్త తెలియగానే కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతయ్యారు.
ఆర్ధిక పరిస్థితులు బాగోలేక గల్ఫ్ గడప తొక్కిన ఆసరి వెంకటేశ్వర్లు అక్కడే మృత్యు ఒడికి చేరాడు. మూడేళ్ల కిత్రం మస్కట్ వెళ్లిన ఆయన.. వీసా గడువు ముగిసినప్పటికీ అక్కడే పనిచేస్తూ జీవనం కొనసాగించాడు. ఈ క్రమంలో జూన్ 16న వీసా సంబంధిత కారణాలతో అక్కడి పోలీసులు వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.
జూన్ 25న ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే.. చికిత్స పొందుతూ అదే రోజు కన్నుమూశాడు వెంకటేశ్వర్లు. ఈ విషాదకరమైన వార్తను అక్కడున్న బంధువుల ద్వారా వెంకటేశ్వర్లు భార్యాపిల్లలు, కుటుంబ సభ్యులకు తెలిసింది.

కుటుంబానికి ఏ కష్టం రాకుండా చూడాలని గల్ఫ్ వెళ్లిన ఆయన మరణ వార్త విని వారంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వెంకటేశ్వర్లుకు భార్య పుష్పలత, ఇద్దరు కుమారులు మనోజ్, అజయ్ ఉన్నారు. ఇంటి పెద్దను కోల్పోయిన ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. వెంకటేశ్వర్లు మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావాలని ప్రభుత్వం వెంటనే స్పందించి అందుకు సహకరించాలని ప్రభుత్వ విప్.. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలను కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. వెంకటేశ్వర్లు అకాల మరణంతో ఆర్థికంగా చితికిపోయిన బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని సర్పంచ్ మిర్యాలకర్ బాలాజీ, గ్రామస్తులు కోరుతున్నారు.