హైదరాబాద్, ఆగస్టు 1: రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ మరో ఔషధానికి అమెరికా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రిటుక్సిమాబ్ బయోసిమిలర్ ఔషధానికి అమెరికా నియంత్రణ మండలి యూఎస్ఎఫ్డీఏ అనుమతినిచ్చినట్టు సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. దీంతో అమెరికా మార్కెట్లో తయారు చేయడానికి, విక్రయించడానికి లైన్‌క్లియర్ అయింది.
అంతర్జాతీయ బయోసిమిలర్ విభాగం మరింత బలోపేతం అవడానికి ఈ అనుమతి దోహదం చేయనున్నదని కంపెనీ గ్లోబల్ హెడ్ శ్రీదేవి తెలిపారు. ఇటీవల ప్రీ-లైసెన్స్ ఇన్స్పెక్షన్కు సంబంధించి యూఎస్ ఎఫ్‌డీఏ ఉన్నతాధికారులు హైదరాబాద్‌కు సమీపంలోని బాచుపల్లి వద్ద కంపెనీ ప్లాంట్‌లో తనిఖీలు చేసి, అనుమతినిచ్చినట్టు తెలిపింది. దేశీయంగా తయారైన ఈ బయోసిమిలర్‌ను యూరోపియన్, బ్రిటన్‌తోపాటు మరో 25 అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎగుమతి చేస్తున్నది. అలాగే స్విట్జర్లాండ్, కెనడా దేశాలకు చెందిన నియంత్రణ మండళ్లు కూడా అనుమతినిచ్చాయి.