గ్రేటర్ హైదరాబాద్‌లో మీకు ఇల్లు ఉన్నదా? సొంత ఫ్లాట్‌లో నివసిస్తున్నామన్న భరోసాతో ఉన్నారా? ఓపెన్ ప్లాట్‌ను చూసుకొని మురిసిపోతున్నారా?.. తస్మాత్ జాగ్రత్త! ఆ ఆస్తి ఇప్పుడు మీ పేరు మీద ఉండకపోవచ్చు! నిషేధిత జాబితాలోకి చేరిపోవచ్చు! మీ అపార్ట్మెంట్ మొత్తం సర్కార్ ఖాతాలోకి వెళ్లి ఉండొచ్చు! అవును.. ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో జరుగుతున్న గందరగోళం ఇదే.. ఏ ఇల్లు అసలైన యజమాని పేరు మీద ఉన్నదో? ఏ ఇల్లు ప్రభుత్వ భూమిలో ఉన్నదో? ఏ ఆస్తి నిషేధిత జాబితాలోకి చేరిందో? తెలియడం లేదు మరి!
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్‌లో దాదాపు 70-90 వేల ఆస్తులను రెవెన్యూ రికార్డుల ప్రకారం నిషేధిత జాబితాలో చేర్చినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్రజలు కష్టార్జితంతో, అన్ని పక్కా అనుమతులతో కొనుక్కున్న ఆస్తులను రెవెన్యూ అధికారులు ఎలాంటి నోటీసులు, ప్రకటనలు లేకుండానే 22ఏ(1)(డీ)లోని యూఎల్సీ, జీ సర్కారీ పేరిట చేర్చారని చెప్తున్నారు. మరికొన్ని నిర్మాణాలను 22ఏ(1)ఏ, బీ, సీల్లోనూ చేర్చినట్టు సమాచారం. దీంతో ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఇల్లో, స్థలమో, ఫ్లాటో అమ్ముకుందామంటే, కొనేవారికి రిజిస్ట్రేషన్ కావడం లేదు. కనీసం లీజ్ డీడ్ చేద్దామన్నా అవకాశం లేకుండా పోయిందని బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీంతో గ్రేటర్‌వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు.
40-50 ఏండ్ల కిందట స్థలాలు సేల్ డీడ్ ద్వారా కొనుగోలు చేసి, వెంచర్లు, సొసైటీల ద్వారా నిర్మించుకున్న ఇండ్లు ఇప్పుడు నిషేధిత జాబితాలో దర్శనమిస్తున్నాయి. కొన్ని దశాబ్దాల కిందట ఏర్పాటుచేసిన సొసైటీలను కూడా ప్రొబేషనరీ జాబితాలో చేర్చడంపై బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఉదాహరణకు హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ఇండస్ట్రియల్ జోన్‌ను గతంలోనే రెసిడెన్షియల్ జోన్‌గా మార్చారు. కానీ ఇప్పుడు అదే ప్రాంతంలోని ఫతేనగర్ రెవెన్యూ పరిధి ప్రాంతాన్ని నిషేధిత జాబితాలోకి చేర్చారు. 17 ఏండ్ల కిందట నిర్మించిన జనప్రియ అపార్ట్మెంట్, పన్నెండేండ్ల కిందట నిర్మించిన కల్పతరు, నాలుగేండ్ల కిందట పూర్తిచేసిన అవంతి, కల్పతరు రెసిడెన్సీ, ఐదేండ్ల కిందట నిర్మించిన బ్రిగేడ్ సిటాడెల్, పన్నెండేండ్ల కిందట పూర్తిచేసిన వాసవి అపార్ట్మెంట్లతోపాటు పరిసరాల్లోని వందలాది ఇండ్లు నిషేధిత జాబితాలో కనిపిస్తున్నాయి.
ఇక్కడ 5 వేలకు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. వారంతా ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియక, దిక్కుతోచని స్థితిలో పడిపోయి, అవస్థలు పడుతున్నారు. అదేవిధంగా యూసుఫ్‌గూడ విలేజ్ పరిధిలోని కల్యాణ్‌నగర్ హౌసింగ్ సొసైటీ మొత్తాన్ని నిషేధిత జాబితాలో చేర్చారు. బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, ఎమ్మెల్యే కాలనీ, పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీ, జూబ్లీహిల్స్, ఎస్ఆర్ నగర్, అమీర్‌పేట, ఖైరతాబాద్ ప్రాంతాల్లోని వందలాది ఇండ్లను ఇదే తరహాలో 22ఏ(1)(డీ)లో చేర్చినట్టు చెప్తున్నారు. ఆయా ప్రాంతాల్లో నివసించేవారు తమ అత్యవసరం నిమిత్తం ఇండ్లను అమ్ముకునేందుకు రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళ్తే ఈ విషయాలు బయటపడుతున్నాయి. ఇవి ఇప్పటివరకు బయటపడ్డవి మాత్రమే అని, నగరవ్యాప్తంగా ఇంకా ఎన్ని వేల ఇండ్లు నిషేధిత జాబితాలో ఉన్నాయోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏండ్ల తరబడి పైసాపైసా కూడబెట్టుకుని కొనుక్కున్న ప్రాపర్టీ, తమ కష్టారితంతో కట్టుకున్న కలల సౌధం, ఉద్యోగాలు చేసుకుని, లోన్లు తీసుకొని కొనుక్కున్న ఫ్లాట్లు నిషేధిత జాబితాలో చేరడంతో బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అన్ని పత్రాలు, అనుమతులున్న తమ ఆస్తులు ప్రొబేషనరీ, జీ సర్కారీ జాబితాలోకి ఎలా వెళ్తాయని ప్రశ్నిస్తున్నారు. ప్లాట్లు, ఇండ్లు అమ్ముకుందామన్నా, ఎవరికైనా లీజ్‌కు ఇద్దామన్నా రిజిస్ట్రేషన్ కాకపోవడంతో ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్‌ను ప్రశ్నిస్తే.. మీ ఇల్లు ఉన్న ప్రాంతం నిషేధిత జాబితాలో ఉన్నదని, రిజిస్ట్రేషన్ చేసేందుకు అవకాశం ఉండదని బదులిస్తున్నారు.
అదేమిటని అడిగితే.. తమకేమీ తెలియదని, తమ పరిధిలో లేదని, కలెక్టర్ పరిధిలో ఉన్నదంటూ సమాధానమిస్తున్నారట. దీంతో బాధితులు కలెక్టరేట్‌కు క్యూ కడుతున్నారు. ప్రజావాణిలో వందలాదిగా ఫిర్యాదులు చేస్తున్నారు. వాటిని పరిష్కరించాల్సిన కలెక్టరేట్ అధికారులు బాధితుల నుంచి ఫిర్యాదులు తీసుకోవడం వరకే పరిమితమవుతున్నట్టు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమ ఆస్తులపై నిషేధం తొలిగించాలని కోరుతున్నారు.