రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్, మార్చి 7 : ప్రభుత్వ లక్ష్యాల సాధనలో బ్యాంకర్లు తోడ్పాటు అందించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(Sandeep Kumar Jha) బ్యాంకర్లను ఆదేశించారు. శుక్రవారం బ్యాంకర్లతో డీసీసీ/డీ.ఎల్.ఆర్.సి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసే సామాజిక పింఛన్లను కొన్ని బ్యాంకులు వివిధ రుణాల కింద జమ చేసుకుంటున్నట్లు సమాచారం ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం అందించే పథకాల సొమ్మును రుణాల కింద జమ చేసుకో వడానికి వీలు లేన్నారు. వెంటనే సంబంధిత లబ్దిదారులకు ఆ సొమ్మును చేర వేయాలని, లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేసే బ్యాంకుల పై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
గత సమావేశంలో జిల్లాలో 3 కొత్త బ్యాంకుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని, ప్రస్తుతం చందుర్తి మండలం మల్యాల గ్రామంలో యూ.బి.ఐ బ్యాంకు బ్రాంచ్ ఏర్పాటుకు పనులు జరుగుతున్నాయని తెలిపారు. రుద్రాంగి మండలం, కోనరావు పేట్ మండలంలో కూడా బ్యాంకుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. గ్రామీణ స్థాయిలో ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందేలా చర్యలు చేపట్టాలని అన్నారు. బ్యాంకుల ద్వారా ప్రజలకు అందే రుణాలు పెరగాలని, జిల్లాలో డిసెంబర్ 31 నాటికి క్రెడిట్ డిపాజిట్ నిష్పత్తి 128.81% ఉందని, జిల్లాలో ప్రతి బ్యాంకు సిడి నిష్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో లీడ్ బ్యాంకు మేనేజర్ టి.ఎన్.మల్లిఖార్జున్ రావు, యూ.బి.ఐ రీజనల్ హెడ్ అపర్ణ రెడ్డి, ఆర్.బి.ఐ ఎల్.డి.ఓ వి. సాయి తేజ్ రెడ్డి, వివిధ శాఖల బ్యాంక్ కంట్రోలర్, మేనేజర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.